రబీలో ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షే అవుతోంది. బస్తా (75 కిలోల)కు మద్దతు ధర రూ.1,416 ఉంటే.. రైతులకు రూ.850 నుంచి రూ.1,100 లోపే దక్కుతోంది. రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని, కళ్లంలోనే ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మిల్లరు చెప్పిందే ధర అవుతోంది. ఆర్‌బీకేలు, సేకరణ కేంద్రాల ద్వారా నేరుగా సేకరించినా చివరకు మిల్లరు వద్దకు వెళ్లేసరికి ఏదో ఒక సాకుతో ధర తగ్గిస్తున్నారు.
విరుగుడు వస్తోందని, నూక ఎక్కువగా ఉందని ఒక్కో బస్తాకు 8 నుంచి 25 కిలోల వరకు తూకం తగ్గిస్తున్నారు. అంటే సగటున రూ.200 నుంచి రూ.500 పైగా కోత పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది. రైతులు మద్దతు ధరకు అమ్ముకున్నట్లే రికార్డుల్లో కనిపిస్తున్నా.. లాభం మాత్రం మిల్లర్లకే దక్కుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది రబీలో 21.75 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగు చేశారు. 65 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని.. అందులో 45 లక్షల టన్నుల వరకు సేకరించాలని పౌరసరఫరాలశాఖ లక్ష్యంగా నిర్ణయించింది.
అయితే.. రైతుల నుంచి 37 లక్షల టన్నుల వరకే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ మొదలు కావస్తున్నా ఇప్పటి వరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సన్న రకాల సాగు పెరిగింది. వాటికి ధర బాగానే ఉన్నా.. తెలంగాణకు వాహనాల రాకపోకలు నిలిచిపోవడం, బెంగళూరు, చెన్నై నుంచి కూడా వ్యాపారులు రాకపోవడంతో అమ్మకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగిలిన రకాలను అమ్ముకుందామంటే మిల్లర్లు అయినకాడికి ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
అమ్మాలంటే.. పోరాడాల్సిందే
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లరుకు పంపినా.. అక్కడ కొర్రీలు పెడుతున్నారు. దీంతో నేరుగా మిల్లరుతో మాట్లాడుకోమంటూ వారు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా దొడ్డు రకాల ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కృష్ణా జిల్లాలో ధాన్యంలో నూక అధికంగా ఉందని ధరలో కోత వేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రకాలే సాగు చేసినా.. విరుగుడు అంటూ ధర తగ్గించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
* గోదావరి జిల్లాల్లో బోండాల రకం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం రైతు కె.సత్యనారాయణ నాలుగెకరాల్లో బొండాల రకం ధాన్యం సాగు చేశారు. నూర్పిడి చేసి నెల అయింది. ఎవరూ కొనకపోవడంతో 160 బస్తాల ధాన్యం కళ్లంలోనే ఉంది. కొనుగోలు కేంద్రానికి వెళ్తే పట్టించుకోవడం లేదు. ఇంటి దగ్గర బస్తాకు రూ.1,150 మాత్రమే ఇస్తామంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.