ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంకురాల్లో అట్టడుగున ఆంధ్రప్రదేశ్.. అగ్రస్థానంలో తెలంగాణ

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులను విడుదల చేశారు. రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే దిశగా ప్రయత్నమేమి జరగనట్లుగా ఈ ర్యాంకింగ్ ద్వారా తేటతెల్లం అయ్యింది. కేంద్రం విడుదల చేసిన స్టార్టప్​ ర్యాంకింగ్​లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పరిమితమైంది.

Startups
Startups

By

Published : Jul 5, 2022, 4:38 AM IST

ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడ ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలంటే అంకుర సంస్థల (స్టార్టప్‌) ఏర్పాటును అమితంగా ప్రోత్సహించాలి. వాటి ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి అనుమతులిస్తూ... అవసరమైన సహకారాన్ని అందించాలి. మన రాష్ట్రంలో ఆ దిశగా ప్రయత్నమేమీ జరగనట్లు... కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం విడుదల చేసిన స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ జాబితా ప్రకారం... దేశంలో అంకురాలను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్లలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌తో కలిసి చిట్టచివరన నిలవడం ఆందోళన కలిగిస్తోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఉత్తమ పద్ధతులు అనుసరిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ పేరు వెతికినా కనిపించలేదు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్‌ మెగాస్టార్స్‌ (బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌), సూపర్‌స్టార్స్‌ (టాప్‌ పెర్ఫార్మర్స్‌), స్టార్స్‌ (ది లీడర్స్‌), రైజింగ్‌ స్టార్స్‌ (యాస్పైరింగ్‌ లీడర్స్‌), సన్‌రైజర్స్‌ (ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్స్‌) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు.

సాధికారత కల్పిస్తున్న తెలంగాణ

తెలంగాణలో బలమైన స్టార్టప్‌ వాతావరణం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ‘స్టార్టప్‌ తెలంగాణ పోర్టల్‌ రాష్ట్రంలో అంకురాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తోంది. ఓపెన్‌ డేటా పాలసీ 2016 ద్వారా విభిన్న డిపార్ట్‌మెంట్లకు చెందిన డేటాను బహిర్గతం చేస్తూ పరిపాలనలో పారదర్శకతకు పీట వేసింది. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి వి-హబ్‌ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసింది. అంకురాలకు నిధులు సమకూర్చడానికి రూ.15 కోట్లతో టి-ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 50కి పైగా అంకురాలు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. టి-ఫండ్‌కు అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్‌జీఎస్‌టీ వెనక్కి ఇస్తోంది. పనితీరు ఆధారంగా గ్రాంట్‌ మంజూరు చేస్తోంది. పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ ఛార్జీలు, ఉద్యోగ నియామకాల కోసం చేసే ఖర్చులను తిరిగి చెల్లించడం ద్వారా చక్కటి ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పడిన ఇంక్యుబేటర్లకు 100% శిక్షణ ఇస్తోంది. 350మందికిపైగా ప్రైవేటు పెట్టుబడిదారులను స్టార్టప్‌లకు మద్దతిచ్చేలా ప్రోత్సహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పదికిపైగా డిపార్ట్‌మెంట్లు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి’’ అని నివేదికలో వివరించింది.

ఏపీది బిహార్‌తోనూ పోటీ పడలేని దుస్థితి

తాజా ర్యాంకుల్లో చివరి విభాగంలో నిలిచిన బిహార్‌ కూడా పలు ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్నట్లు స్టార్టప్‌ నివేదిక పేర్కొంది. అయితే... ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులేమీ ఇందులో కనిపించలేదు. బిహార్‌ 2017 స్టార్టప్‌ పాలసీ విడుదల చేసి రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పది స్టేట్‌ సపోర్టెడ్‌ మెంటార్స్‌తో 250కిపైగా సంస్థలు అనుసంధానమైనట్లు తెలిపింది. దేశంలో వెనుకబడిన బిహార్‌లో కనిపించిన పద్ధతులు కూడా ఏపీలో కనిపించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రెండురోజుల క్రితం కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తొలిగ్రూప్‌లో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ అంకురాలను ప్రోత్సహించడంలో మాత్రం వెనకబడటం గమనార్హం.

వనరులను ఉపయోగించుకోలేని దైన్యం

ఐటీ రంగం అభివృద్ధికి సకల వనరులు ఉండీ మన రాష్ట్రం బిహార్‌తో పోటీపడే స్థాయికి దిగజారింది. రాష్ట్రంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, జేఎన్‌టీయూలు, ఆంధ్ర, ఎస్వీ విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలు, సుమారు 170 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా సుమారు 90 వేల విద్యార్థులకు సాంకేతిక విద్య అందుతోంది. చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చాక అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రయత్నించడానికి అనువైన వాతావరణం రాష్ట్రంలో లేదు. పరిశోధనలు చేయడానికి ఇంక్యుబేషన్‌ సెంటర్లు లేకపోవడంతో విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగానూ పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రం ప్రకటించిన 2021-24 ఐటీ పాలసీలోనూ అంకుర సంస్థలను ఆకర్షించేలా ప్రోత్సాహకాలు లేవు. తెదేపా ప్రభుత్వ హయాంలో విశాఖలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ అభివృద్ధికి ఒక ప్రయత్నం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడలాంటి సన్నాహాలు జరగాల్సిన అవసరాన్ని తాజా ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

26 సూత్రాల కొలమానం

స్టార్టప్‌ ఇండియాలో భాగంగా సామర్థ్యం పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్‌, సంస్థాగత విషయాల్లో మద్దతు అందించడం, మార్కెట్‌ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)... మొత్తం 26 కార్యాచరణ సూత్రాలను కొలమానంగా చేసుకొని 100 మార్కుల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది. ఆ ప్రకారం...

1. మెగాస్టార్స్‌

గుజరాత్‌, కర్ణాటక.

2. సూపర్‌స్టార్స్‌

తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. చిన్న రాష్ట్రాల నుంచి జమ్మూకశ్మీర్‌.

3. స్టార్స్‌

తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, అస్సాం. చిన్న రాష్ట్రాల నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా.

4. రైజింగ్‌ స్టార్స్‌

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌. చిన్న రాష్ట్రాల నుంచి హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, త్రిపుర, దాద్రానగర్‌హవేలి, మణిపుర్‌, నాగాలాండ్‌, పుదుచ్చేరి.

5. సన్‌రైజర్స్‌

బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌. చిన్నరాష్ట్రాల నుంచి మిజోరం, లద్ధాఖ్‌.

* 648 జిల్లాల్లో కనీసం ఒక గుర్తింపు పొందిన స్టార్టప్‌ ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటి సంఖ్య 70,809కి చేరింది. వీటిలో 47% స్టార్టప్స్‌లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ఉన్నారు. అంకురాల ద్వారా 7,50,704 మంది ఉపాధి పొందుతున్నారు.

ఇదీ చదవండి:'ఆ అధికారులపై చర్యలు తీసుకోండి'.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వర్ల రామయ్య లేఖ

కలెక్షన్స్​లో 'విక్రమ్' సరికొత్త మైలురాయి.. ఇక కమల్​ అప్పులన్నీ తీరినట్టే!

ABOUT THE AUTHOR

...view details