కొత్త రేషన్‌కార్డుల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దరఖాస్తులు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అర్జీదారులు తిరుగుతూనే ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఆన్‌లైన్ వ్యవస్థను ఈ ఏడాది ప్రారంభంలో నవీకరించినప్పటికీ కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. లోగడ బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేస్తే అర్హతను గుర్తించేవారు. పేమెంట్ విభాగంలో డబ్బు చెల్లించాక 'టి' (ట్రాన్సాక్షన్) నంబరు వచ్చేది. ప్రస్తుతం కొత్తగా బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. 'నో రెస్పాన్స్ కాంటాక్ట్ టీసీఎస్ టీం' అని వస్తోంది. బియ్యం కార్డు విభజన సమయంలోనూ కచ్చితంగా ఒక మహిళ పేరుంటేనే తదుపరి వివరాల నమోదు సాధ్యమవుతోంది. భర్తకు దూరమైన మహిళ ఒంటరిగా పిల్లలతో ఉంటే ఈ విభజన సాధ్యమవడం లేదు.
నిరుపేదలైనప్పటికీ వారి పేర్లతో ఆస్తులు/వాహనాలు/ఆదాయ పన్ను చెల్లింపుదారు/300 యూనిట్ల పైబడి విద్యుత్తు వాడుతున్నట్లు కంప్యూటర్‌లో వివరాలు వస్తున్నందున కొంత మందికి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం లేదు. తమ అర్హత ఆధారాలు చూపిస్తున్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదు. కార్డులు పొందేందుకు గతంలో అనర్హులై ఉండి, ఇప్పుడు అర్హత సాధించిన వారి వివరాలను ఆధారాలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా నిష్ఫలమే అవుతోంది. రేషన్‌కార్డులో సాధారణంగా తల్లీతండ్రి, కుమారుడు/కుమార్తె పేర్లు ఉంటాయి. వీరిలో పెళ్లయిన కుమారుడి పేరు తొలగించాలి. ఆయన దరఖాస్తు చేస్తే అర్హతలనుబట్టి కొత్త రేషన్‌కార్డు ఇస్తారు.