ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియ యథాతథం - ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు

గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని ఏపీపీఎస్సీకి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే నియామకాలు సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఫలితాల ప్రకటన, పోస్టింగు ఉత్తర్వులు ఇస్తే.. అవి సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయనే విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలంది.

AP Hish court
హైకోర్టు

By

Published : Jun 25, 2022, 5:42 AM IST

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని ఏపీపీఎస్సీకి హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. నియామకాలు సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఫలితాల ప్రకటన, పోస్టింగు ఉత్తర్వులు ఇస్తే.. అవి సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయనే విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలంది. ఎంపికైన అభ్యర్థుల నుంచి కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని, ఎంపికైన నేపథ్యంలో హక్కులను కోరబోమంటూ హామీ తీసుకోవాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులు సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేరాలనుకుంటే అనుమతిస్తామని తెలిపింది. ఆ వ్యాజ్యాల్లో జులై మొదటివారంలో కౌంటరు వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. వాయిదాలు కోరకుండా జులై 14న ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరి జవాబుపత్రాలను భద్రపరచాలని ఏపీపీఎస్సీకి స్పష్టంచేసింది. డిజిటల్‌ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు మాన్యువల్‌ విధానంలో వారు సాధించిన మార్కుల వివరాలను సీల్డ్‌కవర్లో రిజిస్ట్రార్‌ (జ్యుడిషియల్‌) వద్ద ఉంచాలని స్పష్టంచేసింది. అలాగే మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబుపత్రాలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌ వద్ద ఉంచాలంది. రిట్‌ అప్పీళ్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంటర్వ్యూలు ఈ నెల 29తో ముగిశాక ఫలితాలను ప్రభుత్వానికి పంపేందుకు 7 నుంచి 9 రోజులు, అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు మరో 4 నుంచి 6 వారాలు పడుతుందని ఏపీపీఎస్సీ చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. సింగిల్‌ జడ్జి వద్ద జులై 14న తుది విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం తాము ఇచ్చిన ఉత్తర్వులు ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడతాయని తీర్పులో పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

గ్రూప్‌-1 జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇంటర్వ్యూలను నిలుపుదల చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. గ్రూప్‌-1 పోస్టుల ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, తుది ఎంపిక ఫలితాలు న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలుచేస్తూ అభ్యర్థులు కొందరు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించింది.

ఇదీ చూడండి:'వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే.. రైతులకు ఉరితాడు బిగించినట్లే'

బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే తెదేపా దుష్ప్రచారం: మంత్రి బుగ్గన

ABOUT THE AUTHOR

...view details