PGI REPORT: పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచిక (పీజీఐ)లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో నిలిచింది. 2018-19లో లభించిన 24వ స్థానంతో పోల్చితే కొంత మెరుగుపడినా జాతీయస్థాయిలో చూస్తే చాలా అంశాల్లో వెనుకబడింది. కేంద్ర విద్యాశాఖ సోమవారం పీజీఐ నివేదిక- 2019-20ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులు ఇచ్చింది. పాఠశాల స్థాయిలో ఐదు సూచికలను ప్రామాణికంగా తీసుకొని, వాటికి స్కోరు ఇచ్చింది. మొత్తం వెయ్యికి ఏపీకి 811 స్కోరు లభించింది. జాతీయ స్థాయిలో మొదటి ఐదు స్థానాల్లో పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ నిలిచాయి.
అభ్యసన ఫలితాలు, నాణ్యత, బడి మానేస్తున్న పిల్లలు, ప్రాథమిక స్థాయి నుంచి పైతరగతులకు వెళ్తున్న విద్యార్థులు, పిల్లల వయసుకు తగినట్లు తరగతుల్లో ప్రవేశాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, 3, 5, 8 తరగతుల్లో ఎస్సీ, ఎస్టీ, జనరల్ విద్యార్థుల మధ్య ప్రతిభలో వ్యత్యాసం, గ్రామాలు, పట్టణాలు, అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రతిభలో వ్యత్యాసం, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి, ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరు నమోదు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ స్కోరు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలవారీగా తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మంచి పనితీరు కనబరచి, మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విజయనగరం, అనంతపురం, చిత్తూరు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
సమానత్వంలో 35.. విద్యార్థుల నమోదులో 24..:పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచికలో ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకొని స్కోరు కేటాయించారు. సమానత్వం అంశంలో ఎస్సీ, ఎస్టీ, జనరల్ విద్యార్థుల మధ్య లాంగ్వేజ్, గణితం సబ్జెక్టులలో వ్యత్యాసం, గ్రామాలు, పట్టణాలు, అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రతిభను కొలిచేందుకు గతంలో నిర్వహించిన జాతీయ సాధన సర్వేను ప్రామాణికంగా తీసుకున్నారు. సమానత్వం విభాగానికి 230 స్కోరు వెయిటేజీ ఇవ్వగా ఏపీకి 204 స్కోరు లభించింది. జాతీయస్థాయిలో 35వ స్థానంలో నిలిచింది. 228 స్కోరుతో పంజాబ్ మొదటిస్థానం దక్కించుకుంది.
* బడి బయట పిల్లల గుర్తింపు, ప్రాథమిక స్థాయి నుంచి పైతరగతులకు వెళ్తున్న వారు, మధ్యలో బడి మానేస్తున్నవారు. వయసుకు తగ్గ తరగతి చదువుతున్న విద్యార్థుల ఆధారంగా విద్యార్థుల నమోదుకు (యాక్సెస్) 80 వెయిటేజీ ఇవ్వగా.. ఏపీకి 65 స్కోరు వచ్చింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ విభాగంలో 24వ స్థానం దక్కింది. ఈ విభాగంలో కేరళ 79 స్కోరుతో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది.
మౌలిక సదుపాయాలు.. వసతుల్లో 18 ర్యాంకు:మౌలిక సదుపాయాలు, వసతుల్లో రాష్ట్రం 117 స్కోరుతో 18వ స్థానంలో ఉంది. సైన్సు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, పుస్తక బ్యాంకులు, 9-12 వరకు వృత్తి విద్య కోర్సులు, మధ్యాహ్న భోజనం స్వీకరణ, తాగునీరు, పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు నెలల్లోపు ఏకరూప దుస్తుల పంపిణీ, నెలలోపు పాఠ్యపుస్తకాల అందచేత అంశాల ఆధారంగా 150 స్కోరు ఇచ్చారు. జాతీయ స్థాయిలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా.. ఏపీ 18వ స్థానంలో నిలిచింది.
* పాలన, నిర్వహణ విభాగంలోనూ రాష్ట్రం 18వ స్థానంలో నిలిచింది. ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ప్రత్యేక ఐడీ నమోదు, ప్రాథమిక స్థాయిలో పాఠశాలల పరస్పర మార్పు, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను నోటీసు బోర్డులో ఉంచడం, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి తదితర అంశాల ఆధారంగా మొత్తం 360 స్కోరు వెయిటేజీ ఇవ్వగా.. ఏపీకి 271 స్కోరు లభించింది. పాలన, నిర్వహణ విభాగంలో 346 స్కోరుతో పంజాబ్ అగ్రస్థానంలో నిలిచింది.
* అభ్యసన ఫలితాలు, నాణ్యతలో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉంది. జాతీయ సాధన సర్వే (న్యాస్)లో విద్యార్థులు సాధించిన స్కోరు ఆధారంగా స్కోరు కేటాయించింది. 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థులు లాంగ్వేజ్, గణితం, సైన్సులో సాధించిన ప్రమాణాలకు 180 స్కోరు వెయిటేజీ ఇచ్చింది. రాష్ట్రం 154 స్కోరును సాధించింది. అభ్యసన ఫలితాలు, నాణ్యతలో 168 స్కోరుతో రాజస్థాన్ మొదటిస్థానంలో ఉంది.
రాజస్థాన్‌లోని మూడు జిల్లాల అత్యుత్తమ ప్రదర్శన
దేశంలో పాఠశాల విద్యలో జిల్లాల పనితీరును బేరీజు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం 2018-19, 2019-20 పనితీరు ఆధారిత సూచికను విడుదల చేసింది. వివిధ ప్రక్రియల్లో మొత్తం 83 కొలమానాలను ఆధారంగా చేసుకొని 600 మార్కుల ఆధారంగా జిల్లాల పనితీరును లెక్కించారు. 90%కి పైగా మార్కులు సాధించిన జిల్లాలను ‘దక్ష్’గా, 81-90% సాధించిన జిల్లాలను ‘ఉత్కర్ష్’గా, 71-80% మార్కులు సాధించిన వాటిని ‘అత్యుత్తమ్’గా, 61-70% మార్కులు పొందిన వాటిని ‘ఉత్తమ్’గా, 51-60% మార్కులు వచ్చిన వాటిని ‘ప్రచేష్ట-1’గా, 41-50% మార్కులు సాధించిన వాటిని ‘ప్రచేష్ట-2’గా, 31-40% మధ్య ఉన్న వాటిని ‘ప్రచేష్ట-3’గా, 21-30% మధ్య వాటిని ‘ఆకాంక్షి-1’గా, 11-20% మధ్య మార్కులు వచ్చిన ‘ఆకాంక్షి-2’గా, 10% వరకు మార్కులు సాధించిన వాటిని ‘ఆకాంక్షి-3’గా గుర్తించారు. ఇందులో దేశంలో ఏ జిల్లా కూడా 2019-20లో ‘దక్ష్’ గౌరవాన్ని దక్కించుకోలేదు. ‘ఉత్కర్ష్’ గౌరవాన్ని రాజస్థాన్‌లోని 3 జిల్లాలు దక్కించుకున్నాయి. ‘అత్యుత్తమ్’ కేటగిరిలో 86, ‘ఉత్తమ్’ కేటగిరిలో 276, ‘ప్రచేష్ట-1’లో 238, ‘ప్రచేష్ట-2’లో 87, ‘ప్రచేష్ట-3’లో 39, ‘ఆకాంక్షి-1’ (అరుణాచల్ ప్రదేశ్‌లో 2, మిజోరంలో 1 జిల్లా) 3, ‘ఆకాంక్షి-2’లో ఒక జిల్లా (అరుణాచల్ ప్రదేశ్) స్థానం పొందాయి. ఏపీలో 12 జిల్లాలు ‘ఉత్తమ్’ విభాగంలో నిలిచాయి. వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి తొలి, ఉమ్మడి చిత్తూరు చివరి స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం (ఉత్తమ్) తొలి, నారాయణపేట (ప్రచేష్ట-2) చివరి స్థానంలో నిలిచాయి.
ఇవీ చదవండి: