ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు - AP Latest News

సెకండ్ వేవ్
సెకండ్ వేవ్

By

Published : Apr 21, 2021, 6:22 PM IST

Updated : Apr 22, 2021, 4:01 AM IST

18:19 April 21

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రెండో దశ వ్యాప్తి ప్రారంభం నుంచి రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా రాష్ట్రంలో 9,716 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. అటు కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉన్నతస్థాయిలో ఎప్పటికప్పుడు ఆసుపత్రుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా కలవరం.. కొత్తగా 9,716 కేసులు, 38 మరణాలు

      రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ప్రాంతాలనూ కమ్మేస్తోంది. రోజురోజుకీ పాజిటివిటీ రేటుతోపాటు మరణాల సంఖ్యా వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం పరీక్షించిన మొత్తం 39,619 నమూనాల్లో 24.52% మందికి పాజిటివ్‌గా వచ్చింది. రాష్ట్రంలో ఇంతవరకు ఇదే గరిష్ఠం. ఏపీలో 2020 ఫిబ్రవరిలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రోజూ ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదవలేదు. కరోనా మలిదశ ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తోందో చెప్పడానికి ఇది నిదర్శనం. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 9,716 పాజిటివ్‌ కేసులు, 38 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అప్పట్లో గరిష్ఠ పాజిటివిటీ 17.98%
రాష్ట్రంలో 2020 సెప్టెంబరు 4న పాజిటివ్‌ కేసులు గరిష్ఠంగా 17.98% నమోదయ్యాయి. ఆ రోజు 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుతూ 2021 మార్చి 4 నాటికి కనిష్ఠంగా 0.22 శాతానికి పడిపోయింది. ఆ తర్వాతి రోజు నుంచి మలిదశ ప్రభావం మొదలైంది.
*2021 మార్చి 21న నమోదైన పాజిటివ్‌ కేసులు 1.18% ఉంటే... సరిగ్గా నెల రోజుల వ్యవధిలో 2021 ఏప్రిల్‌ 21న 24.52% నమోదవడం... మలిదశలో కరోనా మహమ్మారి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో చెబుతోంది.

మూడు జిల్లాల్లోనే అత్యధిక కేసులు
శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన 9,716 పాజిటివ్‌ కేసుల్లో 3,860 ఈ జిల్ల్లాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,444, గుంటూరులో 1,236, చిత్తూరులో 1,180 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిరుడు... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేసుల నమోదు చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనే తక్కువ కేసులుండేవి. ఇప్పటికీ అవి చివర్లోనే ఉన్నప్పటికీ... శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య భారీగా ఉండటం గమనార్హం. నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 18.68 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం అత్యధికంగా 40.5% పాజిటివిటీ నమోదైంది.

కృష్ణాలో పది మంది మృతి
రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 38 మంది కొవిడ్‌తో చనిపోయారు. వారిలో అత్యధికంగా 10 మంది కృష్ణాలో ఉన్నారు. జిల్లాల వారీగా... నెల్లూరు-7, తూర్పుగోదావరి-4, శ్రీకాకుళం-4, చిత్తూరు-3, ప్రకాశం-3, గుంటూరు-2, కర్నూలు-2, విశాఖ-2, అనంతపురం జిల్లాలో ఒకటి చొప్పున మరణాలు సంభవించాయి.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,86,703కి చేరింది. వాటిలో 60,208 క్రియాశీలక కేసులున్నాయి.

కేసులు తక్కువున్నప్పుడు ఎక్కువ పరీక్షలు
రాష్ట్రంలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్నా... నిర్ధారణ పరీక్షల సంఖ్య ఆ స్థాయిలో పెరగడం లేదు. గతంలో ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు కలిపి రోజుకి 80 వేల వరకు చేశారు. చివరిగా 2021 మార్చి 5న గరిష్ఠంగా 51,660 పరీక్షలు చేశారు. వాటిలో 47,695 ఆర్టీపీసీఆర్‌, 3,965 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Apr 22, 2021, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details