Paper Cars in Mahbubnagar: పైన కనిపిస్తోన్న దృశ్యాల్ని చూస్తే ఏమనిపిస్తోంది..? కార్లన్నీ ఓ చోట పద్ధతిగా పార్కింగ్ చేసినట్లుగా అనిపిస్తోంది కదూ. మీరు చూసేవన్నీ కార్లలాగే ఉన్నా.. ఇవి నిజమైనవి మాత్రం కావు. వాటిని ఎక్కడా పార్కింగ్ చేయలేదు. కార్లంటే ఎంతో ఇష్టపడే ఓ యువకుడు కాగితంతో ఇలా రకరకాల డిజైన్లను తయారు చేసి.. ఔరా అనిపిస్తున్నాడు. కేవలం కార్లు మాత్రమే కాదు.. బైక్‌లు, పోలీసు, మిలిటరీ వాహనాలు, అంబులెన్సులు.. ఇలా ఎన్నో రకాల వాహనాలను తన కళతో రూపుదిద్దుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ న్యూటౌన్‌కు చెందిన అనాజ్ ఫైజీ.
బీటెక్ పూర్తి చేసిన ఫైజీకి కార్లంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే చూసిన కారునల్లా కొనేద్దామనుకునే వాడు. కానీ అన్నింటినీ కొనడం సాధ్యం కాదు కదా.. అందుకే వాటిని కాగితంతో స్వయంగా తయారు చేసి వాటిని చూస్తూ మురిసిపోయేవాడు. క్రమంగా తనకు అదే అలవాటుగా మారిపోయింది. 9 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తన సృజనాత్మకతకు పదును పెట్టిన అనాజ్.. దళసరిగా ఉన్న కాగితాలు దొరికితే వాటిని దాచిపెట్టి.. బొమ్మకార్లు రూపొందిస్తుండేవాడు. ఎక్కడ ఏ వాహనం కనిపించినా.. వాటిని చూసి కొలతలు వేసి.. బొమ్మను గీసేస్తాడు. ఆ బొమ్మకు రంగులు వేసి.. కత్తిరించి.. నమూనాకు అనుగుణంగా తిరిగి అతికిస్తాడు. చూడ్డానికి అచ్చం నిజమైన కారులా కనిపించేలా తీర్చిదిద్దుతాడు. అతను చేసే బొమ్మ కనిష్ఠంగా 3 సెంటిమీటర్ల నుంచి గరిష్ఠంగా 7 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఒక్కో కారు తయారు చేసేందుకు 20 నిమిషాల నుంచి 2 గంటల వరకూ సమయం పడుతుందని అనాజ్ చెబుతున్నాడు.