విభజన హామీలు సహా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై ప్రధానమంత్రితో సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టంగా చెప్పిందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్రికరణశుద్ధితో కేంద్రంతో పోరాడుతున్నామని, కేంద్రంతో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, హోంమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులందర్నీ కలుస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు.
వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తమకు పదవులు ముఖ్యం కాదని అంబటి స్పష్టం చేశారు. ప్రధానిని కలవడంపై తెదేపా చేసిన విమర్శలపై మండిపడ్డారు. సొంత ఎజెండా, సొంత పనులు.. అంటూ ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించిందేకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో.. దేశ ప్రధానిని కలిస్తే, కేంద్ర మంత్రులను కలిస్తే.. తప్పేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఏది చేసినా రైట్ రాయల్‌గా చేస్తారని.. చంద్రబాబు లాగా చీకట్లో ఎవరినీ కలరని పేర్కొన్నారు.