ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2020, 9:42 AM IST

ETV Bharat / city

రాజధాని తరలింపుతో  రూ.237 కోట్లు వృథాయేనా!

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు భారీ పథకాలే కాదు... కట్టుదిట్టమైన రక్షణ నిర్మాణాలూ సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అమరావతికి ‘ముంపు’ ముప్పు ఏ కొంచెమూ ఉండకూడదన్న లక్ష్యంతో రూ.237 కోట్ల వ్యయంతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రెండేళ్ల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇప్పుడు రాజధాని తరలింపు వార్తల నేపథ్యంలో ఆ ప్రజాధనం వృథా కానుందా? అన్నది చర్చనీయాంశమైంది.

amaravathi
amaravathi


ప్రకాశం బ్యారేజీ దాటి వెలగపూడి సచివాలయానికి కరకట్టల మీదుగా వెళుతున్నప్పుడు కరకట్ట మొదట్లోనే మనకో ఎత్తిపోతల పథకం కనిపిస్తుంది. రాజధానిలో ముంపు నివారణ ప్రణాళికలో భాగంగా నిర్మించిన కొండవీటివాగు ఎత్తిపోతల ప్రాజెక్టు అది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.237 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు రాజధాని తరలింపు ప్రతిపాదనల నేపథ్యంలో అమరావతికి ముంపు ముప్పు ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే కొండవీటివాగు వరద రాజధానిలోకి రాకుండా మళ్లించడానికి గత ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంది. వరదను ఎత్తిపోసేందుకు మొత్తం 16 పంపులతో కొండవీటివాగు ఎత్తిపోతలను పూర్తి చేసింది. రోజుకు 5000 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా నదిలోకి మళ్లించేందుకు ఇది ఉపకరిస్తుంది.

ఇక్కడే రాజధాని అనుకున్నందున ఈ స్థాయి వ్యయం చేయాల్సి వచ్చిందని జలవనరులశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని లేకుంటే ఈ ముంపు సమస్య పరిష్కారానికి తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసే అవకాశం ఉండేదని చెబుతున్నారు. నిజానికి రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య ఎల్లప్పుడూ ఉండదు. అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం కొండవీటి వాగులోకి చేరి... కృష్ణా నదిలో కలుస్తుంటుంది. కృష్ణాలో ఎగువ నుంచి భారీ వరద లేనప్పుడు, ఈ నీరు కృష్ణా నదిలో కలవడానికి ఎలాంటి సమస్య లేదు. కృష్ణా నదికి భారీగా వరద వచ్చిన సమయంలో... రాజధాని ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి కొండవీటివాగు ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు మాత్రమే సమస్య. అలాంటి సందర్భాల్లో వరద వెనక్కు ఎగదన్ని ముంపు ఏర్పడేది.

2009 తర్వాత గత 10 సంవత్సరాల్లో ముంపు వచ్చింది లేదు. కొండవీటివాగు 29.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర వాగులు, వంకల నీరు కూడా ఇందులోకే చేరుతుంది. లామ్‌ ఆనకట్ట వద్ద ప్రారంభమైన ఈ కొండవీటి వాగు మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ప్రవహిస్తూ ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది.

798 టీఎంసీలు సముద్రంలో కలిసినా..

ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 798 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీని దాటి సముద్రంలో కలిసిపోయాయి. కృష్ణానదికి ఇంత వరద వచ్చిన సమయంలోనూ అమరావతి రాజధాని ప్రాంతంలో ముంపు ఏర్పడలేదు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రెండేళ్లలో నిర్మాణం

* కొండవీటివాగు ఎత్తిపోతలకు రూ.237 కోట్ల అంచనా వ్యయంతో జలవనరులశాఖ 2016 చివర్లో పాలనామోదం ఇచ్చింది.

* 2017 జనవరి ఒకటిన పనులు ప్రారంభించారు.

* కొండవీటివాగు వరద గరిష్ఠ మట్టం +17.5 మీటర్లు, కృష్ణా నది గరిష్ఠ వరద మట్టం +21.50 మీటర్లు. ఈ కారణంగానే కొండవీటి వాగు వరద కృష్ణా నదిలో కలవకుండా వెనక్కు ఎగదన్ని ముంపునకు కారణమయ్యేది. దీంతో నీటిని నదిలోకి ఎత్తిపోసేందుకు వీలుగా ఎత్తిపోతల నిర్మాణం చేపట్టారు.

* కృష్ణా నదీ తీరానికి సమీపంలోనే అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ వద్ద కొత్తగా పంపుహౌస్‌ నిర్మించారు. మొత్తం 16 పంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు ద్వారా 350 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఏర్పాటు చేశారు. మొత్తం 5000 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 4వేల క్యూసెక్కులు కృష్ణా పశ్చిమ కాలువలోకి మళ్లిస్తారు.

* పంపుహౌస్‌ నుంచి కృష్ణా నదికి నీరు వెళ్లే వరకు మొత్తం 16 వరుసల్లో పైపులైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 1.4 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేశారు.

* ఇక్కడ నీటిని ఎత్తిపోయడానికి 132/11 కె.వి.సామర్థ్యంతో సబ్‌స్టేషన్‌ నిర్మించారు. తాడేపల్లి ఫీడర్‌కు అనుసంధానించే 22 టవర్లను నిర్మించి హైటెన్షన్‌ లైన్లు ఏర్పాటు చేశారు.

* విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే సమస్య రాకుండా... రెండు డీజిల్‌ జనరేటర్లను సిద్ధంగా ఉంచారు.

* ఈ పనులన్నీ పూర్తి చేసి 2018 సెప్టెంబర్‌ 16న పథకాన్ని ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details