జీవనాధారం కోల్పోయాం... అమరావతిని వదులుకోం
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజధానికి మా భూములిచ్చాం. మేం సాగు చేసుకునేటప్పుడు ఎకరానికి ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చేది. జీవనాధారాన్ని కోల్పుతున్నా... నాలుగు రోజులు ఓపికపడితే, గొప్ప నగర నిర్మాణం జరుగుతుందని, రాష్ట్రం బాగుపడుతుందని నమ్మాం. కానీ... ప్రభుత్వమే మమ్మల్ని మోసగిస్తే ఉద్యమించకుండా ఎలా ఉంటాం? అమరావతి ఉద్యమాన్ని ఒక సామాజిక వర్గానికే ఆపాదిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఊరిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అంతా ఒకే కులం వారుంటారా? రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 50 శాతానికి మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల రైతులున్నారు. నాలాగే కడుపు మండి రగిలిపోతున్న వేల మంది అమరావతి కోసం ఉద్యమిస్తుంటే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంటూ మానసికంగా చంపేస్తున్నారు. నిజంగా మేం వ్యాపారులమైతే ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుని, ఆ డబ్బుతో విశాఖపట్నంలోనే భూములు కొనుక్కొనేవాళ్లం కదా.. దిల్లీలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని తెలిసినా వెరవకుండా అమరావతిని కాపాడుకునేందుకు వెళ్లాం. మాకు జరిగిన అన్యాయం, ప్రభుత్వ అణచివేత ధోరణి దిల్లీలోని వివిధ పార్టీల పెద్దలకు అర్ధమైంది. మా ఆవేదన చూసి... ‘అసలు మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా? ఇంత పోరాటం చేస్తుంటే పట్టించుకోరా?’ అని వారు అడిగారు.
కంభంపాటి శిరీష:రాయపూడికి చెందిన సాధారణ గృహిణి. ఎస్సీ వర్గానికి చెందిన ఆమె కుటుంబం రాజధాని నిర్మాణానికి 2.30 ఎకరాల భూమి ఇచ్చింది. రాజధాని ఉద్యమం మొదలయ్యేవరకు ఆమెకు కుటుంబ బాధ్యతలు తప్ప మరో ప్రపంచమే తెలియదు.
రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుంటే ఎవరికీ పట్టదేంటి?
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనమవుతుంటే ఎవరికీ పట్టదేంటి? అన్న ఆవేదనతో పోరాటంలోకి వచ్చా. నాలాంటి వేల మంది రైతుల కన్నీటి గాథల్ని జాతీయస్థాయిలో వివరించేందుకే దిల్లీ వెళ్లా. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతికి మద్దతు తెలిపిన తర్వాతే మేం భూములిచ్చాం. ఇప్పుడు మమ్మల్ని నిలువునా ముంచేశారు. దిల్లీలో నాయకుల్ని కలిసిన తర్వాత మాకు కొంత మనోధైర్యం లభించింది.
మువ్వా సుజాత:అనంతవరంలోని బీసీ వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఆమె కుటుంబం రాజధానికి నాలుగెకరాలు ఇచ్చింది. ఎన్నడూ గడప దాటి ఎరుగని ఆమె... దిల్లీ వెళ్లి రైతుల గళాన్ని జాతీయ నాయకులకు వినిపించారు.
భావితరాల ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతాం?
శాంతియుతంగా పోరాడుతున్న అమరావతి మహిళల్ని వేధించిన తీరు నన్ను కలచివేసింది. మహిళలు అంతలా ఉద్యమిస్తుంటే నేను ఊరికే ఉండలేకపోయా. నాలాంటి వారు ఇప్పుడు ముందుకు రాకుంటే రాష్ట్రానికి జరిగే నష్టంపై భావితరాలు అడిగే ప్రశ్నలకు మన వద్ద సమాధానాలుండవు. అమరావతితో నాకు భావోద్వేగ అనుబంధముంది. దిల్లీలో మేం కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల ఎంపీలను కలిసినప్పుడు.... ఏపీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళుతోందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేశారు.
రాయపాటి శైలజ:గుంటూరుకి చెందినవారు. వృత్తి రీత్యా వైద్యురాలు. రాజధాని అమరావతి మహిళల పోరాటాన్ని చూసి చలించారు. ఉద్యమంలో తొలి నుంచీ భాగస్వామ్యమయ్యారు.