న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) ప్రకాశం జిల్లాలో ప్రభంజనంలా సాగుతోంది. 14వ రోజు టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైన యాత్ర ఎం.నిడమనూరు వరకు 13 కిలోమీటర్ల మేర సాగింది. ఎక్కడికక్కడ మేళ తాళాలు, నృత్యాలతో రైతులకు పూలబాట పరచి గ్రామాల్లోకి ఆహ్వానించారు. జనం స్పందన తమ అలసటను దూరం చేసిందన్న రైతులు.. ఇకపైనా రెట్టించిన ఉత్సాహంతో అడుగులేస్తామని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన మంత్రులు విచక్షణ మరిచి రైతులపై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కందులూరులో దారి వెంట కిలోమీటర్ మేర పూలు పరిచి అమరావతి రైతులను ప్రజలు ఆహ్వానించారు. దీన్ని చూసి అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్ర విజయవంతం అవుతుందో కాదో అన్న మీమాంశ పటాపంచలైందన్న రైతులు.. జనం నుంచి వస్తున్న స్పందన మరువలేమన్నారు. ఉద్యమాన్ని హేళన చేసేలా వ్యవహరించే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రేపటి నుంచి రాజధాని అమరావతి వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ ప్రారంభం కానుండగా...న్యాయ పోరాటంలో విజయం సాధిస్తామని ఐకాస నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రకు ప్రకాశం జిల్లా వాసులు, రైతులతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మద్దతు పలికారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఓకే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు పట్టుదలతో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడి ఇకనైనా మూడు రాజధానుల నిర్ణయంపై పునరాలోచించాలి. ప్రజాభీష్టం మేరకు ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలి. లేదంటే ప్రజాగ్రహనికి గురికాక తప్పదు. - డోలా బాల వీరాంజనేయస్వామి, కొండపి ఎమ్మెల్యే
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగిన రైతుల పాదయాత్ర ఎం. నిడమానూరులో ముగిసింది. రైతులు ఇవాళ రాత్రి అక్కడే బస చేసి రేపటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.
రేపటి నుంచి అమరావతి వ్యాజ్యాల విచారణ..