ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATI PADAYATRA : అటు ఆంక్షల చట్రం.. ఇటు ఉక్కు సంకల్పం - amaravathi farmers padayathra reached seventh day in prakasam district

ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అపూర్వ ఆహ్వానం. అడుగడుగునా పూలబాట. ప్రతినోటా అమరావతి మాట..! ఇలా ప్రకాశం జిల్లాలో మహాపాదయాత్రకు ఎక్కడికక్కడ ఘనస్వాగతం దక్కింది. అండగా ఉంటామంటూ స్థానిక నేతలు, మీ అడుగులోనే నడుస్తామంటూ జనం.. ఏకైక రాజధాని అమరావతి నినాదాన్ని ఎలుగెత్తారు.

మహాపాదయాత్ర
మహాపాదయాత్ర

By

Published : Nov 7, 2021, 10:28 PM IST

Updated : Nov 8, 2021, 5:25 AM IST

పోలీసులు ఎంతగా అణచివేయాలని చూసినా, ఎన్నిరకాల అడ్డంకులు కల్పించినా, ఏ స్థాయిలో నిరోధించాలని చూసినా... అమరావతి రైతుల ఉక్కుసంకల్పం సడలలేదు. ఆ సంకల్పబలానికి ప్రజాశీర్వాదం తోడైంది. రైతన్నలపై పూలవర్షం కురిసింది. పాదయాత్ర ఏడో రోజూ దిగ్విజయంగా సాగింది.

పర్చూరు నుంచి కొనసాగుతున్న మహా పాదయాత్ర

ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా పర్చూరులో ప్రారంభమైన యాత్ర 17 కిలోమీటర్లు సాగింది. నూతలపాడు, వంకాయలపాడు, పూసపాడు, దగ్గుపాడు మీదుగా ఇంకొల్లుకు చేరుకుని సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పెద్దసంఖ్యలో రైతులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు యాత్రను అనుసరించారు. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో యాత్రను చిత్రీకరించారు. వాహనాల వివరాలనూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించారు. సోమవారం పాదయాత్రకు నిర్వాహకులు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం ఉదయం యథావిధిగా ఇంకొల్లు నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ నాగులపాలెం వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

ఉద్రిక్తత.. బైఠాయింపు

హైకోర్టు అనుమతించిన 157 మందే పాదయాత్రలో ఉండాలని, మిగిలినవారంతా పక్కకు వెళ్లాలని పోలీసులు సూచించడంతో ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతులు పర్చూరు శివారులో రహదారిపై బైఠాయించారు. కొంతసేపటి తర్వాత యాత్ర మొదలైంది. కొంతదూరం సాగిన తర్వాత పోలీసులు మళ్లీ నిలువరించే ప్రయత్నం చేయడంతో మరోసారి యాత్ర నిలిచిపోయింది. పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు తదితరులు పోలీసులతో మాట్లాడారు. రైతుల యాత్రకు ఆటంకాలు సృష్టించవద్దని విన్నవించారు. తర్వాత కాస్త ఆలస్యంగా యాత్ర కొనసాగింది. పోలీసు ఆంక్షల విషయం తెలిసి పొలాల్లో ఉన్న మిర్చిరైతులు రోడ్డుపైకి వచ్చారు. యాత్రను ఆడ్డుకోవడం ఏంటని నిలదీశారు. అనంతరం ఈ పరిణామాలతో 157 మంది రైతులు, వేంకటేశ్వరస్వామి రథం, మరో రెండో వాహనాలు ఒకటిగా... మద్దతు తెలిపే జనసందోహం వేరే గుంపుగా విడిపోయి కదిలారు. వివిధ గ్రామాల్లో రైతులు, మహిళలు పాదయాత్రికులపై పూలవర్షం కురిపించారు. గుమ్మడికాయలతో దిష్టితీసి, కొబ్బరికాయలు కొట్టి హారతులు పట్టారు. మధ్యలో స్థానికులు పండ్లు, నీళ్లు, మజ్జిగ అందించారు. గుంటూరు, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచీ పెద్దసంఖ్యలో రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు.

విరివిగా విరాళాలు

తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రూ.10.07 లక్షలు, వివిధ గ్రామాల ప్రజలు మరో రూ.10 లక్షలు, ఇతర దాతలు రూ.5 లక్షలకు పైగా విరాళాలను అమరావతి ఐకాస నేతలకు అందజేశారు.

వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉన్న వాహనాన్ని నడుపుతున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం
ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మహా పాదయాత్రలో హైకోర్టు, రాష్ట్ర డీజీపీ నిర్దేశించిన నిబంధనలను పాటించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్పష్టం చేశారు. పాదయాత్రలో పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామన్నారు. 157 మందే పాల్గొనాల్సి ఉండగా 2వేల మందికి పైగా ఉంటున్నారని చెప్పారు. 4 వాహనాలనే అనుమతించగా 500కు పైగా గుర్తించామన్నారు. రెండు హ్యాండ్‌ మైకులే వినియోగించాల్సి ఉండగా కొందరు వాహనాలపై స్పీకర్లు బిగించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చారని, ట్రాఫిక్‌కు అంతరాయాలు కలిగించారని తెలిపారు. ఎక్కువమంది మాస్కులు ధరించలేదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే భారీగా పోలీసులను మోహరించామన్నారు.

ఇదీచదవండి: KCR : 'కేసీఆర్​ను టచ్​ చేసి.. రాష్ట్రంలో బతికి బట్ట కట్టగల్గుతారా..?'

Last Updated : Nov 8, 2021, 5:25 AM IST

ABOUT THE AUTHOR

...view details