AMARAVTHI CAPITAL CITY ISSUE: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును బోరుపాలెం గ్రామస్థులు వ్యతిరేకించారు. కార్పొరేషన్ ఏర్పాటుపై ఇవాళ నాలుగో రోజు గ్రామసభలు నిర్వహించారు. తుళ్లూరు ఎంపీడీవో ఏ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ జరిగింది. ప్రభుత్వ ప్రతిపాదనను బోరుపాలెం గ్రామస్థులు వ్యతిరేకించారు. సీఆర్డీఏ చట్టంలో చెప్పిన 29 గ్రామాల్లో.. కేవలం 19 గ్రామాలతోనే ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.
అదేవిధంగా.. మంగళగిరి కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో గ్రామసభలు ఎందుకు పెట్టలేదని అధికారులను నిలదీశారు. మూడు రాజధానుల అంశంపై కోర్టులో కేసులను పట్టించుకోకుండా గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. భూ సమీకరణ సమయంలో కూడా ఇలాగే గ్రామసభ నిర్వహించి.. ఒప్పందాలు చేసుకున్నారని.. కానీ ప్రభుత్వం మాట తప్పిందని గుర్తు చేశారు.