వర్షాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా పూర్తిచేయాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రానున్న 45 రోజులు అత్యంత కీలకమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షలో భాగంగా... పోలవరం పనుల పురోగతిపై ఆరా తీశారు. కాఫర్ డ్యాంలో ఖాళీలతోపాటు, అప్రోచ్ ఛానల్‌ను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించగా... మే కల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. స్పిల్ ఛానల్‌లో మట్టి కాంక్రీట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
పునరావాసంపైనా చర్చించిన సీఎం జగన్... ఆర్థికంగా కష్టకాలం అయినప్పటికీ అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయాలనే ఉద్దేశ్యంతో నిధుల విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలోని నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి... ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోలిస్తే.. ఈ 18 నెలల కాలంలో చాలా వేగంగా ముందుకు వెళ్లాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు.