స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని సహాయ, సహకారాలు అందించేలా ఆదేశించాలని కోరుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహకారం కావాలో తెలియజేస్తూ అదనపు అఫిడవిట్ వేయాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రకటించారు.
ఎస్‌ఈసీ అనుబంధ పిటిషన్‌లో ఏముందంటే.... ‘మేం దాఖలు చేసిన వ్యాజ్యం ఈనెల 20న విచారణకు వచ్చాకే ప్రభుత్వం రూ.39.63 లక్షలు విడుదల చేసింది. 6 బిల్లుల్ని పెండింగ్‌లోనే ఉంచారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధుల్లో ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకరించడం లేదు. ఆరేడు నెలలుగా ఎస్‌ఈసీ నియమించుకున్న న్యాయవాదులకు చెల్లించాల్సిన ఖర్చుల చెల్లింపు నిమిత్తం నిధులను విడుదల చేయాలని ఈఏడాది ఆగస్టు 5న ప్రభుత్వానికి వినతి సమర్పించాం. ఎస్‌ఈసీకి నిధుల అవసరముందని పేర్కొన్నాం. దానిపై స్పందించలేదు. నిధుల అవసరాన్ని గుర్తుచేస్తూ ఆగస్టు 24న, సెప్టెంబరు 9న వినతులు పంపాం. ఆగస్టు 25న గవర్నర్‌కూ విన్నవించాం. అయినా ఎన్నికల ప్రక్రియలో తగిన సహకారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని అధికరణ 243కేను ఉల్లంఘించడమే. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంతో ప్రభుత్వం ఎస్‌ఈసీపై విరోధం పెంచుకుంది. కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రసార, సామాజిక మాధ్యమాల్లో దూషణలు చేశారు. తర్వాత ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదించి కమిషనర్‌ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చారు. ఎస్‌ఈసీ, సహాయ కార్యదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల రికార్డులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించగా... తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి’ అని కోరారు.
జస్టిస్ కనగరాజ్ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు న్యాయవాదుల ఫీజు బిల్లుల వివరాలు ఇవే