ప్రతిపక్షాలకు సమయమివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎలక్షన్లు నిర్వహించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతారనే భయంతోనే హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్లోని ఆర్యవైశ్య సంఘంలో రామ్ గోపాల్ పేటకు చెందిన తెరాస సీనియర్ నాయకులు చీర శ్రీకాంత్తో పాటు పలువురు తెరాస కార్యకర్తలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాంత్తో పాటు కార్యకర్తలకు భాజపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా శ్రేణులు సమష్టిగా పనిచేసి భాజపా గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల తీర్పు ముఖ్యం
తెలంగాణలో కేవలం కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. దుబ్బాకలో ఓటమి చవి చూసిన అనంతరం తెరాసలో అలజడి చెలరేగిందని అన్నారు. అనంతరం నగరంలో ఆస్తిపన్ను తగ్గించి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి ఎల్ఆర్ఎస్ రద్దు చేసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఆయన ఉద్ఘాటించారు. ఇంటింటికి నీళ్లు ఇస్తానని చెప్పి వరదనీటిని ఇంట్లోకి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.