jagananna colonies: లేఅవుట్‌లో 5% స్థలాన్ని వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా రూ.217.50 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. ఎకరాపై ఈ భారం రూ.7.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపార రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం లేఅవుట్‌లో 30% స్థలాన్ని రహదారులు, కాలువలు, ఇతర సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నారు. మరో 10% స్థలాన్ని సామాజిక అవసరాలకు సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలకు బదలాయిస్తున్నారు. ఎకరా స్థలంలో 40 శాతం మినహాయిస్తే...మిగిలిన 60 శాతం (2,904 చదరపు గజాల స్థలం)లో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ఇందులో నుంచి మరో 5% స్థలాన్ని కేటాయించాలంటే దాదాపు 145 చ.గజాల స్థలాన్ని ఒదులుకోవాలి. మార్కెట్లో ప్రస్తుతం చ.గజం సగటున రూ.5 వేల ధరకు విక్రయిస్తున్నారు. అంటే ఎకరా స్థలంలోనే రూ.7.25 లక్షల విలువైన స్థలం కోల్పోవాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 3 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో కొత్త లేఅవుట్లకు అనుమతులిస్తున్నారు. అంటే వీటిలో నుంచి 5% స్థలం అంటే 4.35 లక్షల చదరపు గజాలు జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకి కేటాయించాలి. చ.గజం ధర రూ.5 వేల ప్రకారం లెక్కిస్తే ఈ స్థలం విలువ రూ.217.50 కోట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారాన్ని భరించడానికి సిద్ధంగా లేమని...కొనుగోలుదారులపైనే వేస్తామంటున్నారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరపై మరో రూ.వెయ్యి అదనంగా పెంచక తప్పదని విజయవాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏటా 300 నుంచి 400 లేఅవుట్లకు దరఖాస్తులొస్తున్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటున్నాయి. తరువాత స్థానంలో ఉభయగోదావరి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
కొవిడ్‌తో కొనుగోళ్లు బాగా తగ్గాయి..
‘లేఅవుట్‌లో 5% స్థలాన్ని వ్యాపారులు కేటాయించాలంటే అంతిమంగా ఈ భారం కొనుగోలుదారులపై పడుతుంది. భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. కొవిడ్‌తో కొనుగోళ్లు సైతం బాగా తగ్గాయి. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాం’. - తాళ్లూరి శివాజీ, నెరెడ్కో విశాఖ ఛాప్టర్ వ్యవస్థాపక ఛైర్మన్
వెనక్కి తీసుకోవాలి..
‘లేవుట్లలో ఐదు శాతం స్థలాన్ని కేటాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థిరాస్తి వ్యాపార సంఘాలతో కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. లేఅవుట్‌లో ఇప్పటికే 40% స్థలాన్ని ప్రజావసరాల కోసం కేటాయిస్తున్నాం. స్థిరాస్తి రంగం కూడా ఇబ్బందుల్లో ఉన్నందున మా విజ్ఞాపనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం’ -జి.హరిబాబు, జాతీయ స్థిరాస్తి వ్యాపార సమాఖ్య (నెరెడ్కో) రాష్ట్ర అధ్యక్షుడు
మూడు కిలో మీటర్లలో ఎక్కడైనా ఇవ్వొచ్చు కదా!