విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకై 15 మంది మృతికి కారణమయ్యారంటూ...12మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12మంది అరెస్టైన వారిలో ఉన్నారు. విశాఖలో మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంపై నమోదైన కేసు దర్యాప్తుతోపాటు.. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా రెండు నెలల తర్వాత అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఎల్జీ పాలిమర్స్ ఎండీ, సీఈవో సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరక్టర్ డీఎస్ కిమ్ ఉన్నారు.
స్టైరిన్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ సీఎంకు నివేదిక సమర్పించిన ఒకరోజు తర్వాత..అరెస్టు చేశారు. ఎల్జీలో అనేక లోపాలు, భద్రతా పరమైన విషయాలపై నిర్వహణ లేకపోవడం వల్లే ఘోర విషాదానికి దారితీసిందని విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. ప్లాంట్లో అత్యవసర ప్రతిస్పందన విధానం మొత్తం విచ్ఛిన్నమైందని చెప్పారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ అధికారుల తీరును ఉన్నతస్థాయి కమిటీ తప్పుబట్టింది. వారిపై చర్యలకు సిఫార్సు చేయడంతో..ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డిప్యూటీ చీఫ్ ఇన్స్‌స్పెక్టర్ కేబీఎన్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్లు ఇద్దరిపై వేటు వేసింది.
అరెస్టైన వారి వివరాలు:
- సుంకీ జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
- డీఎస్ కిమ్, టెక్నికల్ డైకెర్టర్
- పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
- కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
- రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
- చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
- కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
- ముద్దు రాజేష్, ఆపరేటర్
- పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
- శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
- కె. చక్రపాణి, ఇంజినీర్
- కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్