కైరాన్ కొనుగోలుపై సంతోషం వ్యక్తం చేస్తున్న భారత్ బయోటెక్ ఛైర్మన్ ర్యాబిస్ టీకా ఉత్పత్తిలో ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించనుంది హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ. కుక్క కాటు నుంచి ప్రాణాలు కాపాడే ర్యాబిస్ తయారీలో దశాబ్దాలుగా పేరుగడించిన కైరాన్ బేరింగ్ సంస్థ కొనుగోలుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్ బయోటెక్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం కోటీ ర్యాబిస్ టీకా డోసులు. కైరాన్ కొనుగోలుతో ఈ సామర్థ్యం 2 కోట్ల 50 లక్షలకు పెరిగి ప్రపంచంలో అగ్రగామిగా నిలవనుంది.
కైరాన్ బేరింగ్ కంపెనీలోని వందశాతం ఈక్విటీ వాటాను నగదు బదిలీ ద్వారా కొనుగోలు చేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.
ఎవరీ కైరాన్ బేరింగ్?
గుజరాత్ రాష్ట్రంలోని అంక్లేశ్వర్ ప్రాంతంలో 1960వ దశకంలో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కైరాన్ మాతృసంస్థ జీఎస్కే (గ్లాక్సో స్మిత్ క్లైన్) ఆసియా. వీరి ఉత్పత్తులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలకు సరఫరా చేసేందుకు అర్హత ఉంది. 20కి పైగా దేశాల్లో రిజిస్ట్రేషన్లున్నాయి. 70కి పైగా దేశాల్లో అమ్మకాలకు అనుమతులున్నాయి.
భారత్ బయోటెక్ ఛైర్మన్ మాటల్లో..
"దేశీయంగా 80 శాతానికి పైగా ఉన్న ర్యాబిస్ టీకా కొరత తీర్చటమే మా తొలి ప్రాధాన్యం. ఒకట్రెండేళ్లలో స్వైన్‌ఫ్లూ టీకా కూడా తయారు చేస్తామని నమ్మకముంది."
-కృష్ణా ఎల్లా, భారత్ బయెటెక్ ఛైర్మన్, ఎండీ