అభివృద్ధిని దెబ్బతీసేలా, సంక్షేమాన్ని కుంటుపరిచేలా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని యనమల ఆక్షేపించారు. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేయడమే వైకాపా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న యనమల...నెల రోజుల్లోనే వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త పాలనను ప్రజలు చూశారన్నారు. ఈ ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు ఎదురైతే...ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా కసరత్తే లేదని విమర్శించారు.
ఎన్నాళ్లీ విత్తన కష్టాలు
ఖరీఫ్ సాగుకు విత్తనాలు అందక రైతన్నలు ఆందోళనలు చేసే పరిస్థితులు వచ్చాయన్న యనమల..కనీసం విత్తన పంపిణీపై యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని వ్యాఖ్యానించారు. ఎదుటివాళ్ల ఇళ్లు కూల్చేందుకే ప్రభుత్వం ఆలోచిస్తోంది తప్ప... ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. విత్తనాలకు 380 కోట్ల రూపాయలు ఇవ్వలేనివారు.. వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. 17 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన తెదేపా ప్రభుత్వంపై నిందలేయడం మాని విత్తన కొరత తీర్చాలని హితవు పలికారు.