విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్నాయి. ఇది నిన్నటి మాట. చిత్తూరు జిల్లా పుంగనూరు పాఠశాల ఇందుకు భిన్నం. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మారుతోందనీ ఈ బడి నిరూపిస్తోంది. ఇక్కడున్న మున్సిపల్ హైస్కూల్ లో 'సీట్లు లేవు' అనే బోర్డు పెట్టడం.. మారిన పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. అంతే కాకుండా పాఠశాలలో ఏటా పెరుగుతున్న ఉత్తీర్ణత శాతంతో పాఠశాలలో పరిధికి మించి విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది.. సీట్లు లేవని బోర్డు ఏర్పాటు చేశారు.
1991లో ఈ స్కూలు ఏర్పాటైంది. ఏటా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పిస్తున్న కారణంగా.. తల్లిదండ్రులూ తమ పిల్లలను చేర్పించడానికి పోటీపడుతున్నారు. ప్రస్తుతం బడిలో 700 మంది ఉండాల్సిన చోట 1000 మందికి ప్రవేశం కల్పించారు. వీరందిరికీ పాఠ్యాంశాలు బోధించడం కష్టతరం అవుతుంది కాబట్టే బోర్డు పెట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వం మరింత మంది ఉపాధ్యాయులతో పాటు మౌలిక వసతులను కల్పిస్తే తిరిగి ప్రవేశాలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.