కాంగ్రెస్ ప్రియాంకాస్త్రం.. మారుతున్న రాజకీయం
పార్టీకి మరింత బలం తెచ్చేందుకు ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రధాని అభ్యర్థిగానూ ప్రచారం మొదలైంది. మమత, మాయావతి పేర్లు ప్రధాని అభ్యర్థిత్వం కోసం వినిపిస్తున్నందుకు ప్రతిగా మహిళా నేతగా కాంగ్రెస్ తరఫున ప్రియాంకను రంగంలోకి దించారన్న వాదనలూ ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికే పార్టీలోకి తీసుకొచ్చారని కొందరు, లోక్సభ ఎన్నికల ప్రధాన ప్రచారకర్త అని మరికొందరు చెబుతున్నారు.
ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు. ఈ బాధ్యత ఆషామాషీది కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. సంక్లిష్టమైన కుల, మత, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలకు వేదికైన ఉత్తర్ప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ప్రజలకు చేరువకావడం అంత సులువు కాదు. ప్రధాని నరేంద్రమోదీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఉత్తర్ప్రదేశ్ నుంచే. భాజపా ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాధ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. వారిద్దరినీ ఎదుర్కోవడం ప్రియాంకకు అసలైన అగ్నిపరీక్ష.
ప్రతిపక్షాల కూటమిలోనూ ప్రియాంక కీలకంగా మారే అవకాశం తక్కువే. ఎందుకంటే ఎన్నికలకు సమయం అంతగా లేదు. ప్రచారానికి పరిమితయ్యే అవకాశమే ఎక్కువ. అది కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే. సోషల్ మీడియాలో శక్తిమంతమైన భాజపా సైన్యాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయంలో ప్రియాంక ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో వేచిచూడాలి.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వస్తారన్న ప్రకటన చేసినప్పుడు ఉన్న హడావుడి... ఆమె నిజంగా రంగంలోకి దిగాక కనిపించలేదు. కాంగ్రెస్ సృష్టించదలచిన "బ్రాండ్ ప్రియాంక" తాలూకా ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించలేదు. అంతా సాదాసీదాగా సాగిపోయింది. ఇది వ్యూహాత్మకమా, వ్యూహ రచనలో లోపమా.... కాంగ్రెస్ పెద్దలకే ఎరుక.
కదం తొక్కుతున్న కూటమి... కలవరపెడుతున్న ఓటమి
అంతుచిక్కని భాజపా వ్యూహం..