ప్రైవేట్ ట్రావెల్స్ చోదకులు మత్తులో....ప్రయాణికుల భద్రత గాల్లో! ప్రయాణాలు దారి తప్పుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మత్తులో స్టీరింగ్ పట్టుకుంటున్న డ్రైవర్లు.. అసలు గమ్యాన్ని వదిలి మృత్యు ద్వారం వైపు వాహనాలు నడిపిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లలో.. ఈ విపరీతం ఎక్కువగా ఉంది. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చోదకుల నిర్లక్ష్యంతో..
నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకున్న బస్సు ప్రమాదాల అనంతరం.. అధికారులు చేపట్టిన చర్యల్లో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఇదే ప్రాంతంలో రెండు వారాల క్రితం ప్రైవేటు బస్సు బోల్తా పడిన మరో ఘటనలో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గత వారం కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు.
వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలతో అధికార యంత్రాంగం.. ప్రమాద కారణాలపై దృష్టి సారించింది. ఈ మూడు ఘటనల్లోనూ వాహన చోదకుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపించింది. డ్రైవర్లపై దృష్టిసారించిన అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కంచికచర్ల కీసర టోల్ ప్లాజ్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ముగ్గురు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించినట్లు బయటపడింది. పోలీసులు వరుసగా వివిధ ప్రాంతాల్లో రహదారిపై చేపట్టిన శ్వాస విశ్లేషణ పరీక్షల్లో ఎక్కువ మంది డ్రైవర్లు అధిక మొత్తంలో మద్యం సేవించి బస్సులు నడుపుతున్నట్లు తేలింది.
కృష్ణా జిల్లా కేంద్రంగా వివిధ ప్రాంతాలకు ప్రతి రోజు సుమారు 550 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్తుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రధాన నగరాలకు ఎక్కువగా ఈ బస్సులు నడుస్తుంటాయి. వీటిలో ఏసీ, నాన్ - ఏసీ, స్లీపర్ సర్వీసులు ఉంటాయి. వారాంతంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సమయంలో.. ఇంటికి తొందరగా చేరుకోవాలనే ఆలోచనతో ప్రయాణికులు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. చార్జీలు ఎక్కువైనా.. వేగంగా గమ్యం చేరుస్తారనే ఆలోచనతో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఒత్తిడిలో చోదకులు
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు ప్రైవేటు బస్సు యాజమాన్యాలు కక్కుర్తికి దిగుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ఒకే డ్రైవర్‌తో ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నాయి. ఎన్ని ట్రిప్పులు వేస్తే, అంత జీతం అన్న రీతిలో.. డ్రైవర్లు నిద్రను లెక్కచేయకుండా వాహనాలను నడుపుతున్నారు. అలసటను అధిగమించేందుకు మద్యానికి అలవాటు పడుతున్నారు. ఇలా మద్యం సేవించి, వాహనం నడుపుతూ.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తీరా.. ప్రమాదాలు జరిగాక.. ట్రావెల్స్ యాజమాన్యాలు స్పందిస్తున్నాయి. నష్టం జరిగిన తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగుతున్నాయి. తాగి నడుపుతోన్న డ్రైవర్ల కారణంగా.. ప్రయాణికులతో పాటు తమకూ నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నాయి.
శిక్షలు కఠినతరం
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లపై చట్టపరంగా చర్యలకు సిద్దమవుతోన్న రవాణ శాఖ.. తొలిసారి పట్టుబడితే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2 వేలు జరిమానా వేస్తోంది. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. మూడేళ్లలో రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 3 వేలు జరిమానా విధిస్తుంది. గతేడాది కృష్ణా జిల్లాలో మొత్తం 260 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లే ఉన్నారన్నారు. కేసుల తీవ్రతను బట్టి డ్రైవర్ల లైసెన్సు రద్దుతో పాటు, బస్సుల యజమానులపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. పట్టుబడిన వారందరి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో డ్రైవర్ పట్టుబడితే ట్రావెల్స్ పర్మిట్ రద్దు చేయాలని కోరుతున్నారు. పోలీసులు, రవాణా శాఖ, ఉమ్మడిగా తనిఖీలు చేస్తే ఫలితం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి :వైటీసీ కేంద్రం... గిరిజనులకు వరం