'రఫేల్ ఒప్పందం' విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటు విమర్శలు చేసింది.
రఫేల్ ఒప్పంద సమయంలో రక్షణశాఖతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపిందని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. ఈ కథనంపై శివసేన స్పందించింది. రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, నష్టాల్లో ఉన్న తన స్నేహితునికి లాభం చేకూర్చేందుకు మోదీ ప్రయత్నించారని ఆరోపించింది.
రఫేల్ ఒప్పంద ఆరోపణలపై మోదీ పార్లమెంట్లో మాట్లాడుతూ దేశభక్తి గురించి గొప్పగా చెప్పారు. అయితే మరుసటి రోజు పత్రికలో ప్రచురితమైన ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, ప్రధాని ప్రసంగాన్ని మరిచిపోయేలా చేశాయని శివసేన ఎద్దేవా చేసింది.
ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ఈ అంశంపై ప్రశ్నలు సంధిస్తుంటే జవాబు చెప్పాల్సింది పోయి, భాజపా ఎదురుదాడికి దిగడం సరికాదని శివసేన హితవు పలికింది.
రక్షణ మంత్రిత్వశాఖ, కార్యదర్శులతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని మోదీ ఈ ఒప్పంద నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ విషయం తమ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని, వీటన్నింటికీ ప్రధాని మోదీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని శివసేన పేర్కొంది.