కృష్ణాలో ఆసక్తి కలిగిన నియోజక వర్గాల్లో గుడివాడ ఒకటి. రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకట్టుకునే కేంద్రమిది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత ఇక్కడి నుంచే బరిలో దిగి విజయ భేరి మోగించారు. తెదేపాకు కంచుకోటైన గుడివాడ మధ్యలో చేజారింది. దీంతో మళ్లీ ఇక్కడ పాగా వేయాలని పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఒకప్పుడు కృష్ణ జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్‌ను రంగంలోకి దించింది.
నానికే పట్టం... పసివాడి పరాజయం - undefined
గుడివాడ పసుపు జెండాకు కంచుకోట. తెదేపా వ్యవస్థాపకుడు మెుదటిసారి ఎన్నికల బరిలో దిగిన నియోజకవర్గం. అయితే.. నాని పార్టీని వీడడం అక్కడ తెదేపాకు ప్రాణ సంకటంగా మారింది. గత ఎన్నికల్లో పరాభవాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యింది. గుడివాడ నానికే పట్టం కట్టింది.
మూడోసారి పరాజయం..
తెదేపా ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఇక్కడ పరాజయం పొందింది. 1989లో కాంగ్రెస్ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్, 2014లో వైకాపా నుంచి కొడాలి నాని గెలుపొందారు. మూడోసారి కూడా నాని మరోసారి విజయం సాధించారు. 2009, 2004లోనూ కొడాలి నానినే ఇక్కడ విజయం సాధించారు. అయితే అప్పుడు ఆయన తెదేపా తరపునే పోటీ చేసి విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 1985 ఉప ఎన్నికలు, 1994 ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999 ఎన్నికల్లో రావి హరగోపాల్, 2000 ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు.