'డబ్బు మూటలతో ప్రజాస్వామ్యాన్ని కొనలేవ్...జగన్' - కాలవ శ్రీనివాసులు
నేర రాజకీయాలు చేసే జగన్కు ప్రజాస్వామ్యంపై గౌరవంలేదని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. బళ్లారి నుంచి వస్తోన్న డబ్బు మాటలతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు.
నేర చరిత్ర కలిగిన జగన్ను ప్రజలు సీఎంగా ఆమోదించరని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం తన నివాసంలో మాట్లాడిన ఆయన వైకాపా అధినేతపై విమర్శలు చేశారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. మరో 20 రోజులు ఆగితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరో ప్రజలే తెలస్తారన్నారు. పోలవరంపై ప్రతిపక్షనేత చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ఇప్పటికే 63శాతం పనులు పూర్తయ్యారని తెలిపారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై వైకాపా ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. వైకాపా అభ్యర్థుల ఎంపికంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగిందని విమర్శించారు. వైకాపా ఫ్యాన్ స్విచ్ కేసీఆర్ చేతిలో ఉంటే, ఫ్యూజ్ మోదీ చేతిలో ఉందన్నారు. ఎన్నికల వేళ వైకాపా మద్యం ఏరులు పారిస్తోందిన ఆరోపించారు. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాయదుర్గంలో జగన్ సభ తాగుబోతుల సభగా మారిందని ఎద్దేవా చేశారు. బళ్లారి నుంచి వస్తున్న డబ్బు మూటలకు తెదేపా సరైన సమాధానం చెప్తోందని తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాలకే ప్రజలు ఓట్లు వేస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.