అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామ వాసులంతా వనవాసం బాటపట్టారు. దశాబ్దాల నుంచి వస్తోన్న ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఏటా శ్రీరామనవమి పండుగ ముగిసిన తర్వాత వచ్చే మొదటి సోమవారం ఒక్క రోజు వనవాసం చేస్తారు.
ఉదయం ఆరుగంటలకే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇళ్లకు తాళాలు వేసి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పొలాల్లోనే వంటలు చేసుకొని రోజంతా గడుపుతారు. గ్రామానికి కాపలాదార్లుగా పది మంది ఊరి చుట్టూ ఉంటారు. సాయంత్రం అయ్యాక ఊరి వాకిలిలో మామిడి తోరణాలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఇలా చేయడం వలన గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని నమ్ముతారు.