ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సర్వజన ప్రాంగణం... కన్నీటి సంద్రం

కర్నూలు సర్వజన వైద్యశాల కన్నీటి సంద్రమైంది. వెల్దుర్తి మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో మిన్నంటింది. బంధువులు, ఆత్మీయుల రాకతో విషాదంలో నిండిపోయింది. ఒకేసారి పదహారు మృతదేహాలు అక్కడికి చేరడం వల్ల ఆస్పత్రి ప్రాంగణం స్మశాన వాటికను తలపించింది. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరగడం వల్ల... ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

ఆస్పత్రిలో విషాద ఛాయలు... మిన్నంటిన రోదనలు

By

Published : May 12, 2019, 1:13 PM IST

Updated : May 12, 2019, 6:24 PM IST

సర్వజన ప్రాంగణం... కన్నీటి సంద్రం

కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్న వారొకరు... కష్టాల కోర్చి సంసార నావను నెట్టుకొస్తున్నది ఇంకొకరు... జీవితాంతం కష్టించి.. చరమాంకంలో సుఖ పడే సమయంలో మరొకరు... ఇలా నూనూగు మీసాల ప్రాయం నుంచి, ముదుసలి వయసు వరకూ అందరిదీ ఒక్కో కథ. వీరందరి జీవితాలు ఒకేసారి తెల్లారిపోయాయి. సంతోషంగా నిశ్చితార్థానికి బయలు దేరిన వారికి అదే ఆఖరి ప్రయాణమైంది.

అమ్మ ఎందుకు ఏడుస్తోందో...
నాన్న రూపం మదిలో పదిలం కాకుండానే ఛిద్రమైపోయింది నాగరాజు దేహం. పాప పుట్టి కేవలం నెల మాత్రమే! పుట్టింటి నుంచి భార్య ఇంటికి కూడా రాలేదు. ఇంతలోనే వారి కుటుంబాన్ని చూసి ఆ దేవుడికే కన్ను కుట్టినట్టుంది. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విషాదం నింపేశాడు. నెలరోజుల పాపకు ఓ తండ్రిని దూరం చేశాడు. అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియక... నాన్న ఎందుకు లేవటం లేదో అర్థం కాక... ఆ చిన్నారి విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఇలా చెప్పుకుంటూ వెళితే... ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.

ఒకేసారి పదహారు మృతదేహాలు...
ఒకేసారి పదహారు మృతదేహాలు ఒకేచోట చూసి.... హృదయం చలించిపోయింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోని మృతదేహాలకు సర్వజన వైద్యశాలలో శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మృత దేహాలను మహాప్రస్థానం వాహనాల్లో తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా రామాపురం గ్రామానికి తరలించారు. నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఘటన జరగడం వల్ల రామాపురంతోపాటు గుంతకల్లులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి..

కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష

Last Updated : May 12, 2019, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details