ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వినోద్ జుటీషీతో కలిసి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను వేగంగా ఇవ్వటం కంటే కచ్చితత్వంతో ఇవ్వటానికే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఈసీఐ మార్గదర్శకాలు కచ్చితంగా అమలుచేయాలి
ఈవీఎంల లెక్కింపు సమయంలో మాక్‌పోల్ ఓట్లకు సంబంధించి ఫారం 17సీ విషయంలో ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఏజెంట్లను అనుమతించాలనీ.. 2019 ఫిబ్రవరిలో ఈసీఐ మరింత సంక్షిప్తంగా సూచనలు చేసిందని తెలియచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో క్రమశిక్షణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు.