అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.మహిళలకు చంద్రన్న ఎప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
భారతదేశానికి కుటుంబ వ్యవస్థ గొప్ప వరమని సీఎం అన్నారు.చాలామంది మహిళల్లో సమర్థ నాయకత్వం ఉందిని...మానవ సంబంధాలు చాలా ముఖ్యమని తెలిపారు.కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు.మహిళల ఆత్మగౌరవం కోసమే డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు.
ఇవాళ అన్ని కార్యక్రమాల్లో డ్వాక్రా సంఘాల మహిళల పాత్ర కీలకమైందని సీఎం తెలిపారు. 98లక్షల మంది పేద మహిళలు డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారన్నారు. 35,600గ్రామసమాఖ్యలు ఉన్నాయని...డ్వాక్రా వంటి శక్తిమంతమైన సంఘాలు ఎక్కడా లేవని అన్నారు.త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారు...అది ఎంతో దూరం లేదని వెల్లడించారు.
భవిష్యత్తులో డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తామని సీఎం స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమతో అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.మహిళల పేరుతోనే ఇళ్లు, ఆస్తులు, ఆధునిక పనిముట్లు ఇస్తున్నామన్నారు. మహిళల జీవనోపాధికి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నామని... డ్వాక్రా మహిళలు తయారుచేసే వస్తువులకు ప్రపంచ మార్కెట్ కల్పిస్తామన్నారు. మహిళలను ప్రకృతి సేద్యంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.మహిళలకు రక్తహీనత పెద్ద సమస్యగా ఉందని... అందుకే మహిళలకు అన్న అమృతహస్తంతో మంచి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై అత్యాచారం చేసినవారికి కఠినశిక్షలు తప్పవని హెచ్చరించారు.