నూటికి వెయ్యి శాతం తెదేపానే గెలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో మాట్లాడిన చంద్రబాబు తెదేపాకు సర్వేలు కొత్తేమీ కాదని గుర్తు చేశారు. గత 35 ఏళ్లుగా తెదేపా సర్వేలు చేస్తోందన్నారు. తెదేపా గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 11న ఎన్నికల రోజు ఈవీఎంలలో సమస్యలు వచ్చి కొందరు ఓటు హక్కు వేయకుండా తిరిగి వెళ్లిపోయారు. ప్రసార మాధ్యమాల్లో తాను ఇచ్చిన పిలుపుతో మహిళలు, వృద్ధులు తిరిగి ఓటు వేయడానికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లలలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెదేపా ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఓటు వేయడానికి ముందుకొచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెదేపాను గెలిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల సంఘంపై ఆగ్రహం
బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని 23 పార్టీలు డిమాండ్ చేశాయని చంద్రబాబు తెలిపారు. బ్యాలెట్ పత్రాలు సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం వీవీప్యాట్లు తెచ్చిందని గుర్తు చేశారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బందులు ఉన్నాయని ఎన్నికల సంఘం చెబుతుందన్న చంద్రబాబు... ఆ ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. పారదర్శక విధానంతో ఓటర్లలో నమ్మకం కల్గించాలంటే వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరారు. ఈసీ చేపట్టిన చర్యలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈసీ విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలో ఈసీ నియమాలు వింతగా ఉన్నాయని సీఎం ఎద్దేవా చేశారు.
ఈసీకి ప్రశ్నలు
వైకాపా ఫారం-7ను దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తు ఎక్కడ నుంచి అప్‌లోడ్ చేశారో ఐపీ అడ్రస్ అడిగితే ఈసీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సమాచారం ఇవ్వమని ఈసీ కోరితే నోరు మెదపడం లేదని విమర్శించారు. వైకాపాను రక్షించేందుకే ఐపీ అడ్రసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ వివేకా హత్య కేసు ఇంకా ఎందుకు తేల్చలేదని చంద్రబాబు అన్నారు. హత్యకేసులో ఆధారాలు మాయం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఈసీని ప్రశ్నించారు.