అమెరికాలో నగదురహిత దుకానాలు షాపింగ్ మాల్స్‌లో క్యాష్ కౌంటర్ దగ్గర ఇక పడిగాపులు పడాల్సిన పని లేదు. నేరుగా షాపులోకి వచ్చి నచ్చిన సామాను బ్యాగులో వేసుకొని బయటపడడమే. గతేడాది ఈ సాంకేతిక ఒరవడికి 'అమెజాన్ గో' తెర తీసింది. ఇప్పుడిప్పుడే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సదుపాయాలతో షాపులు వెలిశాయి. ఇవి వినియోగదారుల సమయంతో పాటు.. డబ్బునూ ఆదాచేస్తాయని చెబుతున్నారు నిర్వాహకులు.
" ఈ దుకాణాలు క్యాష్‌లెస్ మాత్రమే కాదు... క్యాషియర్లెస్ కూడా. షాప్‌లోకి వచ్చి యాప్ స్కాన్ చేస్తే చాలు. ఇక మీకు నచ్చిన వస్తువులు తీసుకుని బ్యాగులో వేసుకోని వెళ్లిపోవడమే. మాల్స్‌లో సాధారణంగా నిరీక్షించినట్లు ఇక్కడ వేచి చూడాల్సిన అవసరమే లేదు. "
-మార్క్ మహానే, అంతర్జాల మార్కెటింగ్ నిపుణులు
ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టనుంది. మరో పదేళ్లలో అన్ని షాపుల్లో ఇదే తరహా నగదురహిత షాపింగ్ అందుబాటులోకి వస్తుందని 'స్టాండర్డ్ కాగ్నిషన్' సహ వ్యవస్థపాకులు మిషెల్ సుస్వాల్ అంచనా వేస్తున్నారు.
ఎలా పనిచేస్తాయి?
షాపులోకి మీ చరవాణిలో ఉన్న యాప్‌తో ప్రవేశించాక మిమ్మల్ని పైన ఉన్న కెమెరాలు కనిపెడుతూ ఉంటాయి. నచ్చిన సరుకు బ్యాగులో వేసుకున్నాక మీ ఖాతా నుంచి నగదు షాపు ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఒకవేళ ధర ఎక్కువుందని మళ్లీ అక్కడ పెడితే, మీ ఫోన్‌కి అదే వస్తువుపై ఓ ఆఫర్ ప్రకటిస్తూ సందేశం వస్తుంది. ఇలా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు.
ఇక్కడ కెమేరాలు వాడటం వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది. అందుకు కెమేరాలు సరిగ్గా పైన సీలింగ్‌కు అమర్చాం. జీపీఎస్ మాదిరిగా మాత్రమే పని చేస్తాయి. వినియోగదారుల ముఖాలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ఇందులో ఉపయోగించట్లేదు.
-కృష్ణ మోతుకూరి, సీయీవో, సహ వ్యవస్థాపకులు జిప్పిన్ సంస్థ
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో అమెజాన్ గో తో పాటు జిప్పిన్, స్టాండర్డ్ కాగ్నిషన్ స్టార్టప్ సంస్థలు ఈ సదుపాయన్ని కల్పిస్తున్నాయి. పోలాండ్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా ప్రజలకు ఈ షాపులు అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్నాలజీ మన దేశంలోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.!