రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల అనంతర పరిణామాలపై ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండండిఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ జగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఎంపీ అభ్యర్ధులు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలతో పాటు ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోన్నప్పటికీ.. పార్టీ శ్రేణులు అన్నీ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశాయని అన్నారు.
సబ్సిడీ ఇవ్వాల్సిందే...పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఈసీ వైఫల్యాలు.. వీవీ ప్యాట్ ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయానికి పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై నేతలతో చర్చించారు. సూక్ష్మ సేద్యానికి సంబంధించిన సబ్సీడీ రైతులకు అందడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ ఇవ్వడం లేదని తెలియచేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున సబ్సిడీ ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
శ్రీలంకదాడులను ఖండిస్తున్నాంప్రజా సమస్యలు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపచేయాలని బాబు నేతలకు సూచించారు.ఎన్నికల కోడ్ నెపంతో పరిపాలన కుంటుపడకూడదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరన్నా రెచ్చగొట్టే ధోరణితో ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. శ్రీలంకలో జరిగిన దాడులు మానవతావాదులంతా ఖండించాలని అన్నారు. అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా ఈసీఐ ఆదేశాలు ఇవ్వాలన్నారు.