ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ ఈనెల 23వ తేదీన నర్సాపురం నియోజకవర్గం నుంచి తొలిఫలితం వెల్లడి కానుంది. ఈ నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే జరగనున్నందున ఫలితాలు మొదటిగా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యధికంగా కృష్ణా జిల్లా నందిగామలో 32 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ హాల్ చిన్నది కావడం వలన టేబుళ్ల సంఖ్యను బాగా కుదించారు. దీంతో ఎక్కువ రౌండ్ల కౌంటింగ్ జరుగనుంది. ఇక్కడ 7 టేబుళ్లను మాత్రమే లెక్కించాలని రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. దీనికి సంబధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ అనుమతి తీసుకున్నారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టనుంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. చివరిగా వీవీప్యాట్లు
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సర్వీసు ఓట్లు, తదనంతరం ఈవీఎంలు, చిట్ట చివరిగా వీవీప్యాట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. పోస్టల్, సర్వసు ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా.. 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 36 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వారీగా కొన్ని చోట్ల 14 టేబుళ్లు, 12, 10, 7 టేబుళ్లుగా నిర్ధరించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు లెక్కింపు రోజు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఏజెంట్లు, అధికారుల సంతకాలతో ఈవీఎంలకు మూడు సీళ్లను వేస్తామనీ.. వీటిని ఏమార్చటం వీలుకాదని స్పష్టం చేస్తోంది.