కోటి విద్యలున్నా... కూటి కోసం కొన్ని మార్గాలవైపే మొగ్గు - options
భారత్‌లో 250 జీవనోపాధి మార్గాలున్నా యువత కేవలం ఏడింటి వైపే మక్కువచూపుతున్నారని తాజా సర్వేలో తేలింది. వారికి సరైన అవగాహన కల్పించే వాళ్లు తక్కువమంది ఉన్నారని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
రవి ఈ మధ్యే ఇంటర్ పూర్తి చేశాడు... ఏంట్రా తర్వాత ఏం చేస్తావ్ అని వాళ్ల నాన్న అడిగాడు.. సినిమాటోగ్రఫి కోర్సు చేస్తా అని బదులిచ్చాడు వెంటనే...! 'ఏడ్చావ్... ఎందుకు పనికొస్తుందది. ముందు ఎంసెట్ రాయి.. ఇంజినీరింగ్ చేస్తే తర్వాత ఎలాగోలా ఏదో ఉద్యోగం తెచ్చుకోవచ్చు!' నాన్న సూచన.
ఇలా చాలామంది ఎన్నో అవకాశాలున్నా కేవలం కొన్నింటి వైపే మొగ్గుచూపుతున్నారు. భారత్‌లో 250 జీవనావకాశాలుంటే వాటిలో ఏడింటినే ఎంచుకుంటున్నారు!
దేశవ్యాప్తంగా 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న10వేల మందిపై ఆన్లైన్ సర్వే నిర్వహించారు. వీరిలో 93 శాతం మంది కేవలం ఏడు జీవనోపాధి మార్గాల వైపే ఆకర్షితులయ్యారు. ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం, డిజైనింగ్, మేనేజ్మెంట్ లాంటి రంగాలవైపే మొగ్గుచూపుతున్నారని సర్వే నిర్వహించిన మిండ్లర్ సంస్థ వెల్లడించింది.
''కెరీర్ కౌన్సిలింగ్‌పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్‌లో తక్కువమంది నిపుణులున్నారు. ఏది చేస్తే జీవితం సరైన మార్గంలో ఉంటుందో యువత తేల్చుకోలేకపోతుంది''
- మిండ్లర్ సంస్థ సీఈవో ప్రతీక్ భార్గవ్
దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి కెరీర్ కౌన్సిలర్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ విధానాన్ని వ్యవస్థీకరించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.