నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని ప్రకటించారు.
" ఉద్యోగార్థులు ఇప్పడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. అంకుర సంస్థల స్థాపనలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశ యువత కష్టం, ఆవిష్కరణల పట్ల గర్వపడుతున్నాం.
యువత ఎక్కువగా ఉన్న దేశల్లో భారత్ ఒకటి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా కోటి మంది యువత శిక్షణ పొందారు. దీని ద్వారా వారికి జీవనోపాధి పొందుతున్నారు. ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నాం. ముద్ర యోజన ద్వారా ఇప్పటి వరకూ 15.56కోట్ల మందికి రుణాలు మంజూరు చేశాం. ఈ మొత్తం రుణం విలువ 7.23 లక్షల కోట్ల రూపాయలు.
ఎంఎస్ఎంఈలు, వ్యాపారుల సాధికారత దిశగా చర్యలు తీసుకుంటున్నాం. కోట్లమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. కేవలం 59 నిమిషాల్లో కోటి రూపాయల వరకు రుణం కల్పించేలా పథకాన్ని అమలు చేస్తున్నాం. జీఎస్టీ నమోదు చేసుకున్న ఎస్ఎంఈ పరిశ్రమలకు కోటి రూపాయల ఇంక్రిమెంటల్ రుణాలపై 2 శాతం రాయితీ కల్పిస్తున్నాం. ప్రభుత్వ అవసరాల కోసం ఎస్ఎంఈల నుంచి కొనుగోళ్లను 25 శాతానికి పెంచాం. ఇందులో మహిళలు నడుపుతున్న ఎస్ఎంఈల నుంచి 3శాతానికి తగ్గకుండా వస్తున్నాయి.
గర్భిణులకు 20వారాల పాటు ప్రసూతి సెలవులు కల్పిస్తున్నాం. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద ఆర్థిక భరోసాను ఇస్తున్నాం. "
ఇవి కూడా చదవండి :వరాల పద్దు...ఎన్నికల తాయిలాలు