ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలో టెలీకమ్యూనికేషన్ నెట్వర్క్! కొత్త చట్టం అమలు అప్పటినుంచే!
Published : Jun 22, 2024, 5:05 PM IST
|Updated : Jun 22, 2024, 5:13 PM IST
Telecommunications Act 2023 :జూన్ 26నుంచి టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 అమల్లోకి రానుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం విపత్తునిర్వహణ, పబ్లిక్ ఎమర్జెన్సీ, ప్రజాభద్రత వంటి పరిస్థితుల్లో, అధీకృత సంస్థల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్‌ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే వీలుంటుంది. ఈ మేరకు నోటిఫై చేసిన కేంద్రం 1, 2, 10, 30 వంటి సెక్షన్లతో సహా నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ చట్టం ప్రకారం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధిని, డిజిటల్ భారత్ నిధిగా మార్చనున్నట్లు తెలిపిన కేంద్రం, ఆ నిధిని గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధన, అభివృద్ధి, పైలట్ ప్రాజెక్టులకు వినియోగిస్తామని పేర్కొంది. శాటిలైట్ సేవలు, స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులను వివరించే తదితర సెక్షన్‌లను త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 18వందల 85, వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం 19వందల 33 నిబంధనలు కొత్త చట్టం ప్రకారం భర్తీ అవుతాయని వివరించింది.