జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్- మళ్లీ తిహాడ్ జైలుకు దిల్లీ సీఎం
Published : Jun 29, 2024, 7:10 PM IST
|Updated : Jun 29, 2024, 8:17 PM IST
![జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్- మళ్లీ తిహాడ్ జైలుకు దిల్లీ సీఎం Arvind Kejriwal In cbi judicial custody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21827847-thumbnail-16x9-arvind-kejriwal.jpg)
Arvind Kejriwal Judicial Custody : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు శనివారం కేజ్రీవాల్‌ను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. కేజ్రీవాల్ విచారణ సమయంలో సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాధారాలకు విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారని, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదని వెల్లడించింది. ఇదంతా కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించింది. మరికొన్ని రోజుల పాటు ఆయనను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన దిల్లీ న్యాయస్థానం, కేజ్రీవాల్‌ను జులై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో మళ్లీ ఆయనను తిహాడ్ జైలుకు తరలించారు.