ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు - వైసీపీ కార్యాలయం ప్రకటన - అద్దంకి నియోజకవర్గం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 3:27 PM IST

YSRCP Suspends Five Leaders in Addanki Constituency: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పార్టీలోని నేతలు మరో పార్టీలో చేరుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతల కదలికలపై ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. సంతమాగులూరు మండలానికి చెందిన ఈ ఐదుగురు నేతల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అట్ల చినవెంకటరెడ్డి ఒకరు. ఇటీవల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో చినవెంకటరెడ్డి వర్గం భేటీ అయింది. 

పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు చినవెంకటరెడ్డి వర్గం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​తో సోమవారం భేటీ అయ్యారు. జిల్లాలోని జొన్నతాళిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంతమాగులూరు మండలంలోని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో టీడీపీ చేరేందుకు చర్చలు జరిపారు. సంబంధిత మండల కేంద్రంలో బలమైన సామాజికవర్గానికి చెందిన వెంకటరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపీపీ పదవి దక్కించుకున్నారు. 

ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి, తన అనుచరుడైన వై. యలమందను ఎంపీపీగా నిలబెట్టారు. గతంలో పార్టీ మండల కన్వీనర్​గా ఉన్న చినవెంకటరెడ్డి సోదరుడు పెదవెంకటరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించడం, తాజాగా నియోజకవర్గ ఇంఛార్జ్​గా పనిచేసిన బాచిన కృష్ణచైతన్య స్థానంలో పి. హనిమిరెడ్డిని నియమించడంతో వైసీపీ అధిష్ఠానం తమను గుర్తించడం లేదని మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరేందుకు తన వర్గాన్ని సమాయత్తం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది.

ABOUT THE AUTHOR

...view details