టీడీపీ ప్రచార రథంపై వైఎస్సార్సీపీ నాయకులు రాళ్ల దాడి - ఓ బాలుడికి గాయం - YSRCP Leaders mob attack
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 7:07 AM IST
YSRCP Mob Attack on TDP Leader Surendra Babu in Anantapur District : ఎన్నికల కోడ్ వచ్చినా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం, వడ్డేపాళ్యంలో తెలుగుదేశం ప్రచార రథంపై వైఎస్సార్సీపీ మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ దాడిలో ఓ బాలుడికి రాయి తగలడంతో తలకు గాయమైంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆదివారం రాత్రి వడ్డేపాళ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఓర్వలేని వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగారు.
ప్రచార రథంపైకి వైఎస్సార్సీసీ మూకలు రాళ్లు రువ్వడంతో అమిలినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక రాయి ప్రచార రథానికి తాకి అక్కడే ఉన్న వీరేశ్ అనే బాలుడి నుదిటికి తగలడంతో గాయమైంది. గాయపడిన బాలుడికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు చికిత్స చేయించారు. ప్రతిపక్ష నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న అధికార పార్టీకి కాలం చెల్లిందని అమిలినేని మండిపడ్డారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.