ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ - రైతులతో బహిరంగ సమావేశం - YSRCP MLC Palavalasa Vikrant - YSRCP MLC PALAVALASA VIKRANT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 9:12 AM IST
YSRCP MLC Palavalasa Vikrant Election Code Violation in Manyam District : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు పదే పదే చెబుతున్నా కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రైతులతో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ఇలా రైతులందరిని ఒకే చోటకు చేర్చి సమావేశం ఏర్పాటు చేయటంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీలానగరం పాఠశాల ఆవరణలో బుధవారం సాయంత్రం ఖరీఫ్ సాగుపై పలువురు రైతులు సమావేశమయ్యారు. పాలమెట్ట ఓపెన్ హెడ్ ఛానల్ సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ఇలా సమావేశం నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. దీనిపై ఎంపీడీవో ఎంవీబీ సుబ్రహ్మణ్యం వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు అందిందని, సమావేశం ఆగిపోయిందని చెప్పారు.