పని చేస్తున్న టీచర్లను తొలగించి, కొత్త పోస్టులకు బేరం పెట్టారు! వెలుగులోకి వచ్చిన జగన్ హయాం నాటి బాగోతం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 12, 2024, 7:54 PM IST
YSRCP Leader Fraud in the Name of Jobs: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్తో సన్నిహితంగా ఉన్న వారితో పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమను మోసం చేశారని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. విచారణ జరిపించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో ఆదర్శ పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని తొలగించింది. ప్రకటన విడుదల చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. ఈ క్రమంలో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించారు.
యూనియన్ రాష్ట్ర నాయకులు మదనపల్లికి చెందిన మమత, శ్రీకాకుళంకు చెందిన అనితలు నాటి సీఎం జగన్తో సన్నిహితంగా ఉన్న ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయాలు ఉన్నాయని చెప్పి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 4 లక్షల 40 వేల రూపాయలు వసూలు చేశారని చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బాధితులు 8 మంది ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 120 మంది వరకు ఉన్నారని తెలిపారు.