తిరుపతిలో యథేచ్ఛగా వైసీపీ భూదందాలు - ప్రశ్నిస్తే దాడులు - వైసీపీ కార్యకర్తలు దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 4:57 PM IST
YCP Leaders Attacked on Family in Tirupati District : అధికార పార్టీ నేతల భూదాహానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. ఒకవేళ బాధితులు అధికార నేతలను ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలోని ఉపాధ్యాయ నగర్లోని ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడికి దిగారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించినందుకు ప్రశ్నిస్తే బాధితులపై దాడికి దిగారు.
ఉపాధ్యాయనగర్ కాలనీలో బాలమురళి, అతని తల్లి సుజాతకు సంబంధించిన ఇంటిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో అధికార నేతలు ప్రశ్నించడానికి వెళ్లిన తల్లి, కుమారుడులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ, జనసేన నాయకులు పరామర్శించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో తమపై దాడులకు దిగారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన వారికి టీడీపీ-జనసేన పార్టీ అండగా ఉంటుందని టీడీపీ నేత విజయ్ కుమార్ తెలియజేశారు.