వాలంటీర్ల అత్యుత్సాహాం- వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు - Volunteers in YCP Election Campaign
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 11:30 AM IST
Volunteers in YCP Election Campaign at Paderu: నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. చేజర్ల మండలం పాడేరులో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి వైసీపీ విజయీభవ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఇద్దరు వాలంటీర్లు పవన్, వంశీ, వీఆర్వో ప్రసాద్ ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. వాలంటీర్లు వైసీపీ ప్రచారంలో పాల్గొనడంపై అధికారులను వివరణ కోరగా అతడు రాజీనామా చేశారని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. మిగిలిన వారు హాజరై ఉంటే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినా వాలంటీర్లు యథేచ్ఛగా అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొందరు ఉద్యోగులు అధికార పార్టీ నాయకుల కోసం వారి సేవలో పరితపిస్తున్నారు. అందుకు చేజర్ల, కందుకూరు పట్టణం, వరికుంటపాడుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. వాలంటీర్లు వైసీపీ నేతలతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.