'మా ప్రాణాలు కాపాడండి' - రహదారుల దుస్థితిని నిరసిస్తూ బాధిత గ్రామస్థుల మానవహారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 7:33 PM IST
Villagers Protest to Repair Damage Roads in Anakapalle: రహదారులపై ఏర్పడిన గుంతల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరమ్మతులు చేయమని అధికారులకు ఫిర్యాదు చేసి విసిగిపోయిన గ్రామస్థులు సోమవారం ఆందోళనలకు దిగారు. రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ గ్రామస్థులంతా కలిసి మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఐటీయూ(Centre of Indian Trade Unions) నాయకులు ఆధ్వర్యంలో అనకాపల్లి- అచ్యుతాతాపురం (Anakapalle-Atchyutapuram Road) రహదారి మరమ్మతులు (Repair) చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. రహదారి పక్కనున్న గ్రామస్థులు మానవహారంగా ఏర్పడి గుంతల మయమైన రోడ్డును పునః నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. అచ్చుతాపురం మండలానికి చెందిన నాగులపల్లి, హరిపాలెం, తిమ్మరాజు పేట ప్రాంతాల్లో రహదారిపై స్థానికులు మానవహారం ఏర్పడ్డారు. రహదారి మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రహదారులు సరిగ్గాలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రహదారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణ పనులు వెంటనే చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.