గ్రామ సర్వేయర్ నిర్వాకం - పింఛన్ల సొమ్ముతో ఉడాయింపు - surveyor Escape with pension money - SURVEYOR ESCAPE WITH PENSION MONEY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 9:22 PM IST
Village Surveyor Escape with Pension Money: అనంతపురం జిల్లాలో పింఛన్ల సొమ్ముతో గ్రామ సర్వేయర్ ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. విడపనకల్లు సచివాలయం 2 పరిధిలో గ్రామ సర్వేయర్ ఇనయతుల్లా లబ్ధిదారులకు పంపిణీ చేయవలసిన పింఛన్లు సొమ్ము 2.52 లక్షల రూపాయలతో ఉడాయించాడు. సోమవారం సాయంత్రం మండల పరిషత్ అధికారులతో రూ.2.52 లక్షల నగదును తీసుకున్నాడు. ఈ సొమ్మును మంగళవారం ఉదయం ఫించన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.
అయితే ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లాడని, సాయంత్రం అయినా పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ బాషా విడపనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విడపనకల్లు ఎంపీడీవో శ్రీనివాసులను వివరణ కోరగా, పింఛన్లు సొమ్ముతో సర్వేయర్ ఇనయతుల్లా పరారైనట్లు తెలిపారు. 57 మంది లబ్ధిదారుల పింఛన్ల నగదు 2.52 లక్షల రూపాయలను తీసుకుని, పంపిణీ చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసులు పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.