మద్యం మత్తులో ఈత పందెం- మున్నేరులో దూకి యువకుడు గల్లంతు - Two young men jumped into munneru - TWO YOUNG MEN JUMPED INTO MUNNERU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 7:19 PM IST
Two Young Men Bet and Jumped into Munneru River at NTR District : ఓ వైపు రాష్ట్రంలో ఎడతెరపిలేని వర్షాలతో అపార నష్టం సంభవిస్తుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు కొంతమంది ఆకతాయిలు పందెలు వేసుకొని మరీ వరద నీటిలో దూకుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మద్యం మత్తులో ఉన్న నందిగామకు చెందిన మాడుగుల చంటి, మరొకరు యువకుడు ఆ వరద ప్రవాహంలో ఈత కొట్టేందుకు పందెం వేసుకొని మరీ నీటిలోకి దూాకారు.
వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొంతదూరం వెళ్లాక అందులోని ఒక యువకుడు ఎలాగోలా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ మాడుగుల చంటి అనే యువకుడు మాత్రం బయటకి రాలేక వరదలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బోటును రప్పించి మున్నేరు వాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యల్లో తలమునకలైన అధికారులకు ఆకతాయి చేష్టలు విసుగుతెప్పిస్తున్నాయి.