విద్యుదాఘాతానికి గురైన మహిళ- కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి సైతం మృతి - ELECTRIC SHOCK - ELECTRIC SHOCK
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 4:51 PM IST
Two People Dead Due to Electric Shock in YSR District: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేటలో విషాదం నెలకొంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో నివాసం ఉంటున్న గంగమ్మ ఇంటిలో ఉన్న ఫ్రిజ్‌ను తెరవడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయి కొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన కొండయ్యకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ క్రమంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురవ్వగా గంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న కొండయ్యను చూసిన గ్రామస్థులు అతడిని రక్షించేందుకు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కొండయ్య ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేదలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.