రేపు దేశవ్యాప్తంగా లారీల బంద్ - మద్దతిచ్చిన లారీ ఓనర్స్ అసోషియేషన్ - lorry strike for india
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 5:05 PM IST
Truck Drivers Strike in India : రోడ్డు ప్రమాదాల్లో మరణానికి కారకులైన డ్రైవర్లకు శిక్ష పెంచుతూ కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా లారీల బంద్‌కు యజమానుల సంఘాలు పిలుపునిచ్చాయి. భారతీయ న్యాయ సంహీత చట్టం ప్రకారం, హిట్ అండ్ రన్ (Hit-and-run) కేసుల్లో డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు, రూ.7 లక్షల జరిమానా ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి భారత్ బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా లారీలను ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా లారీ యజమానులు, సంఘాల నేతలు, డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొనాలని సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు ఆదేశించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రవాణా రంగానికి ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసినవారు దర్జాగా బయట తిరుగుతున్నారని తెలిపారు. కానీ, ప్రమాదవశాత్తూ జరిగిన యాక్సిడెంట్లో వ్యక్తి మరణిస్తే డ్రైవర్లకు కఠిన శిక్షలు విధించడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వై.వి. ఈశ్వరరావు డిమాండ్ చేశారు.