తిరుమలలో 'కల్పవృక్షం' అధిరోహించిన మలయప్పస్వామి - తరించిన భక్తులు - Tirumala Brahmotsavalu 4th Day - TIRUMALA BRAHMOTSAVALU 4TH DAY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 1:39 PM IST
Tirumala Brahmotsavalu 4th Day : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు సోమవారం ఉదయం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అతి విలువైన కల్ప వృక్షాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు. కల్పవృక్షంపై కొలువైన స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరతాయన్న భక్తుల విశ్వాసం. కల్పవృక్ష వాహనానికి ముందు వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు.
కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో జె.శ్యామలరావు తెలిపారు. అంతర్గత రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్‌వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు లగేజీ లేకుండా క్యూలైన్‌లో ప్రవేశించాలని సూచించారు.